Dhulipalla on Meters To Water Botes: ఏపీలో 18 లక్షల వ్యవసాయ విద్యుత్ బోర్లకు మీటర్లను అమర్చాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. వైఎస్ జగన్ మెహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయానికి సాయం రోజురోజుకూ తగ్గిపోతుందన్న ఆయన.. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించడం ఎందుకు, మళ్లీ రాయితీల పేర్లతో డ్రామాలు ఎందుకు అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ అబద్ధాలకు కనుక ఆస్కార్ అవార్డు ఉంటే మాత్రం ఏపీ సీఎం జగన్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. 


దేశంలో రూ.75 వేలు, ఏపీలో రూ.2.45 లక్షలు.. 
విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు వల్ల రాష్ట్రంలో వ్యవసాయానికి రైతులు నికరంగా ఎంత కరెంటు వాడుతున్నారో కచ్చితమైన వివరాలు తెలుస్తాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. నాణ్యమైన విద్యుత్ మరో ముప్ఫై ఏళ్ల పాటు ఇవ్వడానికి, నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్ అందించేందుకు మాత్రమే మీటర్లు పెడుతున్నామని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధూళిపాళ్ల ఏపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతుభరోసా పేరుతో ఇతర పథకాలను ఆపేశారని ఆయన విమర్శించారు. రైతులను కులాల పేరుతో, సామాజిక వర్గాల పేరుతో విభజించి కొందరికే లబ్ది చేకూర్చుతుందని ఆరోపించారు. దేశంలో రైతులపై సగటు రుణభారం రూ.75వేలు ఉండగా, ఏపీ రైతులపై ఉన్న రుణభారం రూ.2.45లక్షలతో ఎన్నో రెట్లు ఉందని, అందుకు సీఎం జగన్ విధానాలే కారణమని పేర్కొన్నారు.


రైతులను సైతం బాదుడే బాదుడు.. 
ఏపీ ప్రభుత్వం చేసే పనులు రైతులను సైతం బాదుడే బాదుడు అన్నట్లుగా ఉన్నాయని.. అన్నదాతల బాగు కోసం ఈ ప్రభుత్వం ఒక్క పనీ చేయడం లేదని విమర్శించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకోవడం కేంద్రానికి దాసోహం కావడమే అన్నారు. రైతుల మెడపై కత్తి పెట్టి మీటర్లు బిగిస్తూ, మళ్లీ రాయితీ ఇస్తున్నామని చెప్పడం ఎందుకని ధూళిపాళ్ల ప్రశ్నించారు. బడ్జెట్‌లో మూడేళ్ల కాలంలో వ్యవసాయానికి రూ.35 వేల నుంచి రూ.40 వేల కోట్లు కేటాయింపులు జరపగా.. రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని ఏపీ ప్రభుత్వం కట్టు కథలు చెబుతోందని ఆరోపించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎలా తెచ్చారు, ఏ ప్రాతిపదికన ఖర్చు పెట్టారో రైతులకు వివరించాలని డిమాండ్ చేశారు.


Also Read: Meters For MOtors Politics : వ్యవసాయ మోటర్లకు మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లా ? ఏపీ సర్కార్ చెబుతున్నట్లుగా మంచిదా ?


Also Read: Satyam Babu: అయేషా మీరా హత్య కేసు - ఇంకా న్యాయం జరగలేదంటోన్న నిర్దోషి సత్యం బాబు, అతడి బాధలు వర్ణనాతీతం