ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విధానాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. రాజకీయంగా ఒక రకంగా ఉన్నా తమ పాలసీల విషయంలో రెండు ప్రభుత్వాలు భిన్నంగా వెళ్తున్నాయి. ఒకరితో ఒకరికి పోలికలు లేకపోతే ఎలాంటి సమస్యా లేదు కానీ తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు ఓ విషయంలో పదే పదే ఏపీ వైపు చూపించి విమర్శలు చేస్తున్నారు. రైతుల మెడకు ఉరితాడు వేస్తున్నారంటున్నారు. అదే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం. తాము పెట్టబోమని తెలంగాణ మంత్రులు చెబుతున్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టడం మంచిదనేనని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎవరి వాదన కరెక్ట్ ?



ఆరు నెలల్లో ఏపీ వ్యాప్తంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు !



ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ విద్యుత్‌ బోర్ల కనెక్షన్లకు ఆరు నెలల్లో విద్యుత్‌ మీటర్లు పూర్తిగా అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయానికి రైతులు నికరంగా ఎంత కరెంటు వాడుతున్నారో కచ్చితమైన వివరాలు తెలుస్తాయని ప్రభుత్వం చెబుతోంది. నాణ్యమైన విద్యుత్ మరో ముప్ఫై ఏళ్ల పాటు ఇవ్వడానికి ..రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు.. నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్ అందించేందుకు మాత్రమే మీటర్లు పెడుతున్నామని ఏపీ ప్రభఉత్వం చెబుతోంది.   


రైతుల మెడకు ఉరేస్తున్నారన్న తెలంగాణ సీఎం , మంత్రులు !


తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోమంటున్నారు. కేంద్రం రూ. నాలుగైదు వేల కోట్ల అప్పు ఆశ చూపిస్తూ మోటార్లకు మీటర్లు పెట్టమంటోందని అలా చేస్తే రైతుల మెడకు ఉరి వేయడమేనని అంటున్నారు. తాము ఆ తప్పు చేయబోమని రైతులకు హామీ ఇస్తున్నారు. మీటర్లు పెడితే రైతుల పరిస్థితి ఆగమైపోతుందని .. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నాని తాను ప్రాణం పోయినా మీటర్ల పెట్టబోనని కేసీఆర్ ప్రకటించారు. మంత్రులు కూడా తరచూ అలాంటి ప్రకటనలే చేస్తున్నారు. 




మీటర్లు పెడితే  బిల్లులు వస్తాయి.. కట్టాల్సింది రైతులే !
 
తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అమలవుతోంది. అందుకే ఎలాంటి మీటర్లు బోర్లకు పెట్టలేదు. కానీ కేంద్రం సంస్కరణలకు అంగీకరించిన రాష్ట్రాలు సబ్సిడీలను ఆపేయాలి. అలా చేస్తే వ్యతిరేకత వస్తుంది. అందుకే మీటర్లను పెట్టిన ఎంత వ్యయం అయిందో అంతా ప్రభుత్వం చెల్లించాలి అంటే.. నగదు బదిలీ చేయాలని నిర్ణయించారు. అంటే ప్రభుత్వం మీటర్లు పెడితే... దానికి బిల్లులు వస్తాయి. రైతుల కరెంట్ బకాయిలు ఉన్నట్లే అవుతుంది. రైతు పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంటే..  బిల్లు కూడా కట్టుకోవాలి. 


నగదు బదిలీ చేస్తామంటున్న ఏపీ ప్రభుత్వం ! 



బిల్లులు మాత్రమే వస్తాయి రైతులు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రతీ నెలా బిల్లు జనరేట్ అవగానే.. తాము ముందుగానే ప్రారంభించే రైతు ఖాతాకు ఎంత బిల్లు వచ్చిందో అంతా జమ చేస్తామని.. ఆ బిల్లు ఆటోమేటిక్‌గా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తారని.. రైతులు కట్టాల్సిందేమీ లేదని అంటోంది. అయితే రైతులకు మాత్రం ఈ విషయంలో అనేక అనుమానాలున్నాయి. 


గ్యాస్ సబ్సిడీని లాగే చేస్తారేమోనని రైతుల భయం ! 
 
 గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ ఎత్తివేసి.. ఎంత సబ్సిడీ ఇస్తున్నామో.. అంత మొత్తం వినియోగదారు ఖాతాలోకి మళ్లిస్తామని కేంద్రం ఓ సంస్కరణ తీసుకొచ్చింది. దీనిపై ప్రజల్లో గగ్గోలు రేగింది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆందోళనలు చేసింది. చివరికి ఎన్నికల సమయంలో ఇలాంటి వివాదాస్పద నిర్ణయం వద్దనుకుని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కానీ బీజేపీ అధికారంలోకి రాగానే.. తాము వ్యతిరేకించిన నగదు బదిలీని అమలు చేయడం ప్రారంభించారు. మొదట్లో   నాలుగు, ఐదు వందలు వచ్చే సబ్సిడీ  ఇప్పుడు రూ. 40కి పడిపోయింది. పోనీ గ్యాస్ సిలిండర్ ధర ఏమైనా తగ్గిందా అంటే ఇంకా పెరిగిపోయింది. విద్యుత్‌కూ ఇలా చేయరన్న గ్యారంటీ ఏముందని భయపడుతున్నారు.


అర్హత పేరుతో కొత్త నిబంధనలు తెస్తారేమోననే ఆందోళన


ఇప్పుడు సాగుకు మోటార్లు ఎంత కరెంట్ వాడుకుంటున్నారో తెలియదు. కరెంట్ ఉన్నప్పుడు అవసరానికి వాడుకుంటూ ఉంటారు. మీటర్లుపెట్టిన తర్వాత ఎవరైనా కాస్త ఎక్కువ వాడుకుంటే వారికి అర్హత లేదని ఉచితవిద్యుత్ ఆపేస్తారేమోనన్న ఆందోళన ఉంది. ఇవన్నీ రైతుల్లో ప్రభుత్వం వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతాయి. అందుకే తెలంగాణ  ప్రభుత్వం మీటర్లు పెట్టేందుకు సిద్ధపడటం లేదు. కానీ ఏపీ మాత్రం దూకుడుగా ముందుకెళ్తోంది.