రాష్ట్రంలో అవినీతి, లంచాలు, అక్రమాలకు వీల్లేకుండా సమగ్ర శాశ్వత భూ సర్వే జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో దేశానికే రాష్ట్రం మార్గదర్శిగా నిలవాలని నిర్దేశించారు. వైఎస్ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు అందించారు. ఈ సందర్భంగా సమగ్ర భూ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్‌ని సీఎం పరిశీలించారు. డ్రోన్‌ పని తీరుని అధికారులు సీఎంకు వివరించారు.


‘‘ఏప్రిల్‌ 5 కల్లా భూ సర్వేకోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వేపనుల్లో నిమగ్నమై ఉంటాయి. మరింత వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నాం.  మొత్తంగా భూ సర్వే కోసం 154 డ్రోన్లను వినియోగిస్తాం. ఇప్పటివరకూ 1441 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి అయింది. వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర డ్రోన్‌ సర్వే నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నాం. రెవెన్యూ విలేజ్‌ చొప్పున సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం’’ అని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.


సర్వే ఫలితాలు పూర్తిగా అందేలా రికార్డుల స్వఛ్చీకరణ ఉంటుంది. వెబ్‌ ల్యాండ్‌ అప్‌డేషన్, గ్రామ ల్యాండ్‌ రిజిస్టర్‌ అప్‌డేషన్, గ్రామ ఖాతా రిజిస్టర్, దీంతోపాటు జగనన్న భూ హక్కు పత్రం ఇస్తారు. గ్రామ సచివాలయాల వారీగా భూ వివరాలను అధికారులు అప్‌డేషన్‌ చేస్తారు. దీనివల్ల గతంలో వెబ్‌ల్యాండ్‌ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం వస్తుందని అధికారులు తెలిపారు. 5200 గ్రామాల్లో 2023 జులై నెలాఖరుకు, 5700 గ్రామాల్లో 2023 ఆగస్టు నెలాఖరు కల్లా, సెప్టెంబరు నెలాఖరు నాటికి 6,460 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేలా కార్యాచరణ పూర్తిచేసుకున్నట్టు అధికారులు సీఎంతో అన్నారు.


ఓఆర్‌ఐ (ఆర్థోరెక్టిఫైడ్‌ రాడార్‌ ఇమేజెస్‌) చిత్రాల ప్రక్రియ మొదటి విడత గ్రామాల్లో ఈ ఏడాది నవంబర్‌ నెలాఖరు నాటికి, రెండో విడత గ్రామాల్లో డిసెంబర్‌ నెలాఖరు నాటికి, మూడో విడత గ్రామాల్లో జనవరి నెలాఖరు నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు. 


ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘గతంలో వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఇది జరగాలి. దీంట్లో అనుసరించాల్సిన విధానాలు, ఎస్‌ఓపీలను తయారు చేయాలి. రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, టాంపర్‌ చేయలేని విధంగా చేయాలి. ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్‌ రికార్డులు కూడా తయారుచేయాలి. సీఎం ఈ ఫిజికల్‌ డాక్యుమెంట్‌ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. సబ్‌ డివిజన్‌ కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలి. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలి. లంచాలకు తావులేకుండా ఈ వ్యవస్థ నడవాలి.  అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలి. ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.’’


‘‘భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలి. దీనివల్ల స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయి. భూ యజమానులకు క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేనాటికి దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలి. ఇందులో భాగంగా న్యాయశాఖను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. దీనిపై ఓ రోడ్‌మ్యాప్‌ను కూడా తయారు చేయాలి. భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో  దేశానికి ఒక దిక్సూచిగా రాష్ట్రం నిలవాలి. అందుకనే సీనియర్‌ అధికారులను, సీనియర్‌ మంత్రులను ఇందులో భాగస్వాములుగా చేశాం.’’ అని జగన్ అన్నారు.


ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి(రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం,  సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రెవెన్యూశాఖ కమిషనర్‌ సిద్దార్ధ జైన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.