AP High Court : కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణపై ఐఏఎస్ లు క్షమాపణలు కోరారు. క్షమాపణలు కోరడంతో జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని తీర్పు ఇచ్చింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్ లను హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు హాస్టళ్లల్లో సేవా కార్యక్రమం చేపట్టాలని తీర్పు ఇచ్చింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల వైఖరిని కోర్టు ధిక్కరణగా భావించి ఇవాళ తీర్పు ఇచ్చింది. ఐఏఎస్ అధికారులు విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎంఎం నాయక్ లు కోర్టు ధిక్కరణ ఎదుర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వానికి షాక్
గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వానికి కోర్టుల్లో షాక్ లు తగులుతున్నాయి. ప్రభుత్వం వర్సెస్ న్యాయస్థానం అన్నట్లు పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారుల తీరుపై కోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఒకేసారి 8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించింది. పాఠశాల ప్రాంగణంలో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడంపై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాలు ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఈ విషయాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుంది.
ఏ కేసులో కోర్టు ధిక్కరణ?
పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాల తొలగించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏడాది పాటు కోర్టు ఆదేశాలు పట్టించుకోలేదని మండిపడింది. దీంతో అధికారుల తీరును హైకోర్టు కోర్టు ధిక్కరణగా భావించింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా తీర్పులు వస్తున్నాయి. ఎక్కువ తీర్పుల్లో ఉన్నతాధికారుల తీరుపై కోర్టు మండిపడింది. అమరావతి విషయంలోనూ హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం బహిరంగంగా విమర్శించింది. రైతులు ఇచ్చిన భూములను రాజధాని అవసరాలకు తప్ప వేరే దానికి వాడడానికి అధికారం లేదని కోర్టు చెప్పింది. శాసనసభలో మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు, సీఎం జగన్ న్యాయవ్యవస్థ పరిధి దాటుతుందని ఆరోపించారు. ఇలా చాలా సందర్భాల్లో హైకోర్టు తీర్పులను ప్రభుత్వం పై కోర్టులో సవాల్ చేస్తూనే వస్తుంది.