గత ప్రభుత్వాలు దోచుకున్నాయని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, మనపై నిందలు వేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 అన్నీ కలిసి నిందలు వేస్తున్నాయని అన్నారు. మన పిల్లల్ని ప్రజల్ని ద్వేషించే ఇలాంటి వారిని మనుషులు అనాలా? లేక మనుషుల రూపంలో ఉన్న దయ్యాలు అనాలా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చి మంచిని ఛిన్నాబిన్నం చేస్తున్న ఎల్లో మీడియాను మీడియా అనాలా? లేక రక్త పిశాచులు అనాలా అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్లకు పురస్కారాలు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న పేరుతో మూడు కేటగిరీల్లో అవార్డులను ఇవ్వనున్నారు.


‘‘రాష్ట్రానికి ఫలానా నిధులు కావాలని అడిగేందుకు నేను ఢిల్లీకి వెళ్లా. ఒక ముఖ్యమంత్రి, ప్రధాని గంటకు పైగా మంచి వాతావరణంలో జరిగితే, జీర్ణించుకోలేదని ఎల్లో మీడియా మోదీ జగన్‌కు క్లాస్ పీకారని ప్రచారం చేస్తోంది. నేను మోదీని కలిసినప్పుడు ఆ గదిలో ఎవరూ లేరు. ఆ సమయంలో ఎల్లో మీడియాగానీ, దత్త పుత్రుడు గానీ ఎవరైనా మా సోఫాల కింద దాక్కొని విన్నారా? ఇంత అసూయ మీకు పనికి రాదు. మీకే త్వరగా గుండెపోట్లు వచ్చి త్వరగా టికెట్ తీసుకోని పోతారు. ఇది మంచిది కాదు. నేనిప్పుడు నీతితో ఉన్న రాజకీయ నాయకుడితోనో, వ్యవస్థతోనో యుద్ధం చేయట్లేదు. మారీచుడితో, రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. ఏ పార్టీతో కావాలంటే వాటితో కలిసిపోయి ఏ వాగ్ధానం కావాలంటే అవి ఇచ్చేస్తారు. తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేస్తారు. తర్వాత రాష్ట్రానికి పండక్కి వచ్చినట్లుగా వచ్చి వెళ్తుంటారు. 


ఈ నాయకులతో పాటు ఎల్లో మీడియా అంతా గజ దొంగల ముఠా. వీరికి నీతి లేదు. నియమం లేదు. న్యాయం లేదు. ధర్మం లేదు. ప్రజలంటే ప్రేమ అంతకన్నా లేదు. అధికారం తప్ప వేరే ఎజెండా లేనే లేదు. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. వీరు చెప్పే మాటలను అస్సలు వినకండి. దుర్మార్గపు ప్రచారాలు అస్సలు నమ్మకండి. మంచి జరిగితే జగన్‌ను ఆదరించండి.. లేదంటే జగన్‌ను ద్వేషించండి. అంతేకానీ, బాబును ఎల్లోమీడియాను అస్సలు నమ్మకండి’’ అని జగన్ మాట్లాడారు.


20 రోజుల పాటు వాలంటీర్ల సన్మాన కార్యక్రమాలు
వాలంటీర్ల సేవలకు గౌరవంగా నేటి నుంచి 20 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జగన్ చెప్పారు. ప్రతి మండలానికి మూడు రోజుల చొప్పున 20 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని నరసాపురంలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొంటారు. ఉత్తమ వాలంటీర్లుగా ఎంపికైన వారికి శాలువా కప్పి, నగదు బహుమానం అందించి, బ్యాడ్జ్ పెట్టి, సర్టిఫికేట్ ఇచ్చి గౌరవిస్తారు. సేవా మిత్ర మొదటి లెవెల్ వాలంటీర్లకు ఇచ్చే పురస్కారం. ఈ ఏడాది 2.28 లక్షల వాలంటీర్లకు సేవామిత్ర అవార్డులు ఇస్తున్నాం. రూ.10 వేల నగదుతో పాటు, బ్యాడ్జ్, శాలువా కప్పి సన్మానిస్తాం. చేసిన సేవకు ప్రభుత్వం తరపు నుంచి సర్జిఫికేట్ కూడా ఇస్తాం. 


సేవా రత్నలో భాగంగా మండలానికి ఐదుగురు చొప్పున మున్సిపాలిటీలకు నగర పాలక సంస్థలకు 10 చొప్పున ఎంపిక చేయబడ్డ 4,136 మంది వాలంటీర్లకు సేవారత్న అందిస్తాం. దీని కింద ప్రతి వాలంటీర్ కు రూ.20 వేల నగదు, మెడల్, శాలువా, బ్యాడ్జ్, సర్టిఫికేట్ ఇస్తాం.


సేవా వజ్ర అవార్డుల్లో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉత్తమ ఐదుగురు వాలంటీర్లను ఎంపిక చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వాలంటీర్లకు ఈ సేవా వజ్ర అవార్డులను అదిస్తాం. దీని కింద ప్రతి వాలంటీర్‌కు రూ.30 వేల నగదు, ఒక మెడల్, బ్యాడ్జి, శాలువా కప్పి సన్మానించి, సర్టిఫికేట్ అందిస్తాం. ప్రతివాలంటీర్ సేవల పట్ల నేను ఎంతో గర్వపడుతున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2.33 లక్షల మంది వాలంటీర్లకు రూ.239 కోట్ల రూపాయలను బహుమానంగా ఇవ్వబోతున్నాం.’’ అని సీఎం జగన్ అన్నారు.