గ్రామ వాలంటీర్లు గొప్ప సైనికులని, సేవలకులని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఊహలకు అందని పాలన నడుస్తోందని అన్నారు. 2019 జూన్ నుంచి ఈ నెల వరకూ మార్చి 2022 వరకూ ఈ వాలంటీర్లు పెద్దలకు, వితంతువులకు రూ.50 వేల కోట్లను పంపిణీ చేశారని అన్నారు. వాలంటీర్ల సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. లంచాలు, వివక్ష, అవినీతి, రాజకీయాలకు తావు లేకుండా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని, లబ్ధిదారులందరికీ చక్కగా అన్నీ అందుతున్నాయని వివరించారు. గతానికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్లకు పురస్కారాలు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న పేరుతో మూడు కేటగిరీల్లో అవార్డులను అందించారు. 


అనంతరం సీఎం జగన్ అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వాలంటీర్ల సేవలకు గౌరవంగా నేటి నుంచి 20 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలానికి మూడు రోజుల చొప్పున 20 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని నరసాపురంలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొంటారు. ఉత్తమ వాలంటీర్లుగా ఎంపికైన వారికి శాలువా కప్పి, నగదు బహుమానం అందించి, బ్యాడ్జ్ పెట్టి, సర్టిఫికేట్ ఇచ్చి గౌరవిస్తారు. సేవా మిత్ర మొదటి లెవెల్ వాలంటీర్లకు ఇచ్చే పురస్కారం. ఈ ఏడాది 2.28 లక్షల వాలంటీర్లకు సేవామిత్ర అవార్డులు ఇస్తున్నాం. రూ.10 వేల నగదుతో పాటు, బ్యాడ్జ్, శాలువా కప్పి సన్మానిస్తాం. చేసిన సేవకు ప్రభుత్వం తరపు నుంచి సర్జిఫికేట్ కూడా ఇస్తాం. 


సేవా రత్నలో భాగంగా మండలానికి ఐదుగురు చొప్పున మున్సిపాలిటీలకు నగర పాలక సంస్థలకు 10 చొప్పున ఎంపిక చేయబడ్డ 4,136 మంది వాలంటీర్లకు సేవారత్న అందిస్తాం. దీని కింద ప్రతి వాలంటీర్ కు రూ.20 వేల నగదు, మెడల్, శాలువా, బ్యాడ్జ్, సర్టిఫికేట్ ఇస్తాం.


సేవా వజ్ర అవార్డుల్లో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉత్తమ ఐదుగురు వాలంటీర్లను ఎంపిక చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వాలంటీర్లకు ఈ సేవా వజ్ర అవార్డులను అదిస్తాం. దీని కింద ప్రతి వాలంటీర్‌కు రూ.30 వేల నగదు, ఒక మెడల్, బ్యాడ్జి, శాలువా కప్పి సన్మానించి, సర్టిఫికేట్ అందిస్తాం. ప్రతివాలంటీర్ సేవల పట్ల నేను ఎంతో గర్వపడుతున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2.33 లక్షల మంది వాలంటీర్లకు రూ.239 కోట్ల రూపాయలను బహుమానంగా ఇవ్వబోతున్నాం.’’ అని సీఎం జగన్ అన్నారు.