తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ఇంకా నడుస్తూనే ఉంది. కృష్ణా జల వివాదంలో ఏపీ పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై సీజేఐ ఎన్వీ రమణ విచారణ చేపట్టారు. జల వివాదానికి మధ్యవర్తిత్వమే మంచిదని.. సోమవారం నాడు జరిగిన విచారణలో జస్టిస్ రమణ చెప్పారు. అయినా ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. న్యాయపరంగానే సమస్యకు పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.


కృష్ణా ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.


జస్టిస్ రమణ ఏం చెప్పారంటే...


'కృష్ణా జ‌లాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం... ద్వారా క‌లిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటే సరిపోతుంది కదా. మీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయం చెప్పండి. మధ్యవర్తిత్వం ద్వారా స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేలా చూడండి. నేను రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వాడిని. రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వానికి అంగీక‌రిస్తేనే మంచిది. అవసరమైతే ఇందుకు సుప్రీంకోర్టు కూడా సహకరిస్తుంది. ఈ విషయంలో అనవసరంగా కోర్టు జోక్యం చేసుకోవాలని భావించడంలేదు.' అని జస్టిస్ రమణ సూచించారు.


మరోవైపు.. సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్రం కోరింది.  కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సీజేఐ ఎన్వీ రమణ తోసిపుచ్చారు. ఈ కేసును మరో ధర్మాసనానికి జస్టిస్ రమణ బదిలీ చేశారు.



మధ్యవర్తిత్వం కుదరదు అంటే.. పిటిషన్ ను వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తానని చెప్పినట్లే... బుధవారం జస్టిస్ రమణ బదిలీ చేశారు. ఇక ఈ కేసు ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది తెలియాల్సి ఉంది. తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా ఉంది.


కృష్ణానది జలాల వివాదంపై రివర్‌బోర్డు సభ్యులు గురువారం రాయలసీమలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. బృందంలో తెలంగాణకు చెందినవారు ఎవరూ ఉండకూడదని బోర్డుకు ఇప్పటికే ఏపీ సర్కార్‌ షరతు విధించిన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలతో.. కేఆర్ఎంబీ బృందం పర్యటించబోతోంది. ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించి ఎన్జీటీకి నివేదికను ఇవ్వనుంది.



ఇదిలా ఉండగా.. మంగళవారం జరిగిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమన్వయ భేటీకి.. తెలంగాణకు చెందిన సభ్యులు గైర్హాజరయ్యారు. గెజిట్‌ ప్రకారం ప్రాజెక్టుల స్వరూపంపై అభ్యంతరాలున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నందున వివరాలు ఇవ్వాలని బోర్డు సభ్యులు కోరగా అందుకు ఏపీ నిరాకరించింది. తెలంగాణ మాత్రం పూర్తిస్థాయి బోర్డు భేటీ జరిపిన తర్వాతే.. సమన్వయ కమిటీ భేటీ జరపాలని కోరుతోంది. ఇదే అంశంపై గతంలో గోదావరి యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. కృష్ణాబోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని అత్యవసరంగా అయినా ఏర్పాటు చేయాలని.. ఆ తర్వాతే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ వాదిస్తోంది.