తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఓ హత్య కేసు వ్యవహారం సంచలనంగా మారింది. ఓ వ్యక్తి చనిపోయిన కేసులో ఏకంగా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, హత్యకు గురైన వ్యక్తి ఓ కారు డ్రైవర్. గత నెల జులై 29న అతణ్ని కొందరు హత్య చేయగా, ఆ కేసును విచారణ చేపట్టిన పోలీసులు.. అందులో భాగంగా తాజాగా 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఒక హత్య కేసులో ఇంత మందిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసుకు ఎనలేని ప్రాధాన్యం వచ్చింది.
కరీంనగర్ జిల్లా నేదునూర్ గ్రామానికి చెందిన 42 ఏళ్ల వయసున్న వ్యక్తి జులై 29న దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. కరీంనగర్ జిల్లా పోలీసులు ఓ హత్య కేసుతో సంబంధం ఉన్న ఏకంగా 16 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే, హత్యకు గురైన అతణ్ని దుండగులు తొలుత కిడ్నాప్ చేసి ఆ తర్వాత దారుణంగా హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
Also Read: Gold-Silver Price August 4: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి కూడా నేల చూపులు, తాజా ధరలివీ..
కరీంనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాబ్ డ్రైవర్ ఎన్.తిరుపతి అనే 42 ఏళ్ల వ్యక్తి తొలుత కిడ్నాప్‌కు గురయ్యాడు. కరీంనగర్ జిల్లాలో జులై 29న రాత్రి గుండ్లపల్లి నుంచి నేదునూరు వస్తుండగా ఒక దుకాణం వద్ద ఆగి తన స్నేహితుడి కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో జి.సురేందర్ అనే వ్యక్తి తన అనుచరులైన సత్యనారాయణ, వి.నాగరాజు, వి.త్రిమూర్తి, కే.చందర్ రావు తదితరులు తిరుపతిని కిడ్నాప్ చేసి తుప్పల్లోకి తీసుకెళ్లి చంపేశారు. ఈ ఐదుగురికి గతంలో నేర చరిత్ర ఉందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు.
తొలుత ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఐదుగురు నిందితులని గుర్తించారు. వీరిలో సురేందర్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని గుర్తించారు. అంతేకాక, మరో 11 మందికి కూడా ఈ హత్యతో సంబంధం ఉందని భావించి జి.శ్రీనివాస్, జి.నరేందర్, జే.రాజయ్య, ఎన్.ఎల్లయ్య, ఎన్.గంగరాజు, జి.ప్రవీణ్, పి.తిరుపతి, కే.సంపత్, ఓ.గణపతి రెడ్డి, ఓ.వెంకట్ రెడ్డి, డి.కొమురయ్య అనే వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ 11 మంది వ్యక్తులు ఆ ఐదుగురు వ్యక్తులు హత్య చేసేందుకు సహకరించారని తాము విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
నేదునూరు ప్రాంతంలో దిగువ మానేరు ప్రాజెక్టు ముంపు బాధితులు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం పొందే వీలు లేకుండా తిరుపతి ప్రయత్నిస్తున్నాడని, అందుకే తాము అతణ్ని అంతమొందించినట్లుగా నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న 'Q' న్యూస్ ఆఫీసులో పోలీసుల తనిఖీలు.. కారణం అతడేనా?