ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న అకాల వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పంట నష్టపోయిన వారి జాబితాను వీలైనంత త్వరగా రెడీ చేయాలని ఆదేశించారు. వారిని అన్ని రకాలుగా ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచేశాయి. అన్ని రకాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు రైతులపై ఎంత ప్రభావం చూపాయి. ఎంత నష్టం జరిగిందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదని పౌరసరఫరాల శాఖాధికారులకు దిశానిర్దేశం చేశారు. 


క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షాలకు నష్టపోయిన రైతుకు భరోసా కల్పించాలన్నారు సీఎం జగన్. వీలైన త్వరగా అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు. నివేదికలు రెడీ చేయాలని సూచించారు. ఆ మేరకు ఈ నెలలోనే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా అందివ్వాలని. దీంతోపాటు ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 


నష్టపోయిన రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని అధికారులు చెప్పారు సీఎం జగన్. వాటిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించాలన్నారు. మార్చిలో జరిగిన నష్టాలపై నివేదికలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు అధికారులు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సంబంధించిన నష్టాల అంచనాలను వారం పది రోజుల్లో పూర్తవుతుందన్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడు రోజుల పాటు వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పలు ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చు. గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని అంచనా వేస్తోంది. మంగళవారం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా, నంద్యాల, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. 


ఈ మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, సీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉంది. పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.


సీఎంకు లోకేష్ లేఖ 


అకాల వర్షాలతో పాటు పంటలను కొనుగోలు చేయనికారణంగా  నష్టపోయిన రైతులను  ఆదుకోవాలని సీఎం జగన్‌కు..టీడీపీ నేత లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల వర్షాల ధాటికి రైతులు విలవిల్లాడుతూంటే.. ముఖ్యమంత్రి కనీసం స్పందించడం లేదని..  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అనేది మ‌రోసారి గుర్తు చేస్తున్నానని నారా లోకేష్ లేఖలో పేర్కొన్నారు.  రైతుల పంట‌లు కొనుగోలు బాధ్య‌త ప్ర‌భుత్వానిదే అని ప్ర‌క‌టించి ప‌ట్టించుకోకపోతే ఎలా అని లోకేష్ ప్రశ్నించారు..ఎన్నిక‌ల‌కి ముందు మీ మాయ మాట‌లు న‌మ్మిన రైతాంగం ఇంకా అవే భ్ర‌మ‌ల్లో ఉన్నారని, త‌మ వ‌ద్ద‌కే వ‌చ్చి మ‌ద్ద‌తు ధ‌ర‌కి పంట‌లు కొనుగోలు చేసి స‌కాలంలో డ‌బ్బులు కూడా చెల్లించేస్తార‌నే ఆశ‌లు నాలుగేళ్లుగా ఆడియాశ‌ల‌వుతూనే ఉన్నాయన్నారు.