మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుల్లో ఒకటైన ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పై నేడు (అక్టోబరు 11) విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న అనంతరం ఏసీబీ కోర్టు పీటీ వారెంట్‌పై విచారణ గురువారానికి (అక్టోబరు 12) వాయిదా వేసింది. సీఐడీ తరఫున న్యాయవాది వివేకానంద సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఫైబర్ నెట్ కేసు వివరాలు, ఎంత మందిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారనే విషయాలను వివేకానంద న్యాయమూర్తికి వివరించారు. చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఉందని ఆయన వాదించారు. ఈ క్రమంలోనే పీటీ వారెంట్‌పై వాదనలు కొనసాగించడానికి ఏసీబీ కోర్టు సమ్మతించింది. తర్వాత విచారణను గురువారం (అక్టోబరు 12) మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. వాదనల అనంతరం ఏసీబీ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది.


కాల్‌ డేటా పిటిషన్‌పై తమ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టును కోరారు. దీంతో గురువారం మధ్యాహ్నమే వాదనలు వినడానికి ఏసీబీ కోర్టు అంగీకరించింది. అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన రైట్ టు ఆడియెన్స్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది.


పీటీ వారెంట్ అంటే ఏంటి?


పీటీ వారెంట్ అంటే (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ - Prisoner in Transit). ఇప్పటికే జైలులో ఉన్న ఖైదీని మరో కేసులో విచారణ కోసం, జైలు నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేలా కోర్టు అనుమతి కోరతారు. అప్పుడు కోర్టు పీటీ వారెంట్ ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జైలులో ఉన్న ఖైదీని మరో చోటికి తరలించడం. సీఆర్పీసీలోని సెక్షన్ 269 కింద కోర్టు పీటీ వారెంట్‌ని ఇస్తుంది.


సెప్టెంబరు 19న పీటీ వారెంట్ దాఖలు


ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ ను సెప్టెంబరు 19న ఏసీబీ కోర్టులు సీఐడీ దాఖలు చేసింది. ఏపీ ఫైబర్ నెట్ స్కాంపై సీఐడీ పీటీ వారెంట్ వేసింది. టెర్రా సాఫ్ట్ కి అక్రమంగా టెండర్లు ఇచ్చారని సీఐడీ ఆరోపించింది. అందులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. 2021లో మొత్తం 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. రూ.121 కోట్లు గల్లంతు అయ్యాయని సీఐడీ ఆరోపించింది. 


సీఐడీ చేస్తున్న ఆరోపణల ప్రకారం.. ఫైబర్‌ నెట్‌ స్కాంలో రూ.115 కోట్ల నిధులు దోచుకున్నారని సిట్‌ దర్యాప్తులో తేలింది. 2019లోనే ఫైబర్‌ నెట్‌ స్కాంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంట్లో ఏ - 1గా వేమూరి హరి ప్రసాద్‌, ఏ - 2 మాజీ ఎండీ సాంబశివరావుగా పేర్కొంది. చంద్రబాబుకు వేమూరి హరిప్రసాద్‌ అత్యంత సన్నిహితుడు. దీంతో ఫైబర్‌ నెట్‌ స్కాంలో చంద్రబాబు పాత్రను సీఐడీ గుర్తించింది.


టెర్రా సాఫ్ట్‌కు అక్రమ మార్గంలో టెంబర్లు ఇవ్వడంపై సీఐడీ విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌ గడువు వారం రోజులు పొడిగించినట్లు తేల్చింది. బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్‌ దక్కేలా మేమూరి హరిప్రసాద్ చక్రం తిప్పారని గుర్తించింది. ఫైబర్‌ నెట్‌ ఫేజ్‌-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా.. రూ. 115 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ ఆరోపించింది. టెర్రా సాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలు జరిగాయని సీఐడీ వివరించింది.