Chandrababu on CM Jagan: ఏపీలో పాలన అస్థవ్యస్తమయ్యిందని టీడీపీ జాతీయ అద్యక్షులు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిస్థితులు గాడిలో పడాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని స్పష్టం ‌చేశారు. పెరిగిన నిత్యవసరాలతో ప్రజలు సతమతమవుతుంటే వైసీపీ నాయకులు ఇసుక దోపిడీలో తలమునకలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబరు 20 నుంచి తాను నియోజకవర్గాలలో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు.


రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆలోచనలో మార్పు రావాలన్నారు. జనవరి నుంచి సైకిల్ స్పీడ్ పెరుగుతుందని చెప్పారు. వైసీపీ చిల్లు పడిన నావ అని ఎద్దేవా చేశారు. ఆ పడవ నుంచి దూకి పారిపోయిన వాళ్ళు ప్రాణాలు దక్కించుకుంటారు.. లేని వారు చరిత్రలో కలిసిపోతారని చెప్పారు. మరో మూడు నెలల తర్వాత జగన్ అడ్రస్ ఉండదని అని స్పష్టం చేశారు. జగన్ కనీసం తన అపాయింట్‌మెంట్ అమ్మకు కూడా ఇవ్వడని, అటువంటి వ్యక్తిని ఎన్నుకున్నందుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని తెలిపారు. 


‘‘రాష్ట్రంలో ఆరాచక సైన్యాన్ని జగన్ ఏర్పాటు చేసుకున్నారు. సామాన్యంగా ఇంట్లో పని వాళ్ళను కూడా మార్చం కానీ.. జగన్ మాత్రం ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్లు మార్చుతున్నారు. ఎమ్మెల్యేల చేత తప్పుడు పనులు చేయించాడు.. ఇప్పుడు పక్కన పెట్టాడు. చిల్లర పదవులు బలహీన వర్గాలకు ఇచ్చి దానినే సామాజిక న్యాయం అని  జగన్ కలరింగ్ ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తన ఎంపీలను గుమాస్తాలకంటే హీనంగా జగన్ చూస్తున్నారు. అత్మాభిమానంతో ప్రవర్తిస్తే తప్పుడు ‌కేసులు పెట్టి పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. ఆందుకు ఉదాహరణే ఎంపీ రఘు రామకృష్ణంరాజు’’


టీడీపీ, జనసేన ప్రభుత్వం చారితాత్మక అవసరం


వచ్చే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ధగా పడ్డ రాష్ట్రాన్ని కాపాడటం కోసం టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి. ప్రజలు వివేకంతో ఆలోచించాలి. రాష్ట్ర విభజన తర్వాత నేను చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగిస్తే తెలంగాణతో సమానంగా రాష్ట్రం అభివృద్ధి‌ చెందేది. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా‌ తెస్తానన్న జగన్ ఇప్పుడు కేసులు కారణంగా మీన మేషాలు లెక్కిస్తున్నాడు. కేంద్రం మెడలు వంచి మరీ హోదా తెస్తానని చెప్పి.. తన మెడలనే కేంద్రం వద్ద  దించుకొన్నాడు. టీడీపీ ప్రభుత్వం ఉంటే 2020 లోనే పోలవరం పూర్తి అయ్యేది. 2019 లో టీడీపీ అధికారంలోకి వచ్చినట్లేతే 2020లోనే పోలవరం పూర్తిచేసి సాగుకు నీరందించే వాళ్లం’’ అని చంద్రబాబు తెలిపారు.


టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు


వైఎస్ఆర్ సీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఇద్దరు ఎమ్మెల్యేల దంపతులు శుక్రవారం (డిసెంబర్ 15) చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేల అనుచరులు కూడా భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. చంద్రబాబు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘ నాయకుడు బూదాటి రాధా కృష్ణయ్యతో పాటు 6 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వైఎస్ఆర్ సీపీ కింది స్థాయి లీడర్లు టీడీపీలో చేరారు. నేతల చేరికలతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది.