వైఎస్ఆర్ సీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఇద్దరు ఎమ్మెల్యేల దంపతులు శుక్రవారం (డిసెంబర్ 15) చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేల అనుచరులు కూడా భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. చంద్రబాబు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘ నాయకుడు బూదాటి రాధా కృష్ణయ్యతో పాటు 6 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వైఎస్ఆర్ సీపీ కింది స్థాయి లీడర్లు టీడీపీలో చేరారు. నేతల చేరికలతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది.


వైసీపీ నుంచి కొద్ది నెలల క్రితమే సస్పెండ్ అయిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అధికారికంగా తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి గత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ సస్పెండ్ చేసింది. గత మార్చిలో ఈ వ్యవహారం జరిగింది. ఇలా వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌ చేయడం అప్పట్లో వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. అప్పటినుంచి ఆ నలుగురు ఎమ్మెల్యేలు జగన్‌పై, ముఖ్యంగా పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా జగన్ అప్పుడు సస్పెండ్ చేశారు. 


సస్పెండ్ అయిన నాటి నుంచి ఉండవల్లి శ్రీదేవి టీడీపీతో సన్నిహితంగానే ఉంటున్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా ఉండవల్లి శ్రీదేవి చురుగ్గా పాల్గొన్నారు. తాజాగా అధికారికంగా టీడీపీలో చేరారు.