Latest News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నుంచి మరో పథకాన్ని ప్రారంభించనుంది. ఇంటింటికీ వెళ్లి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్లను వెంటనే క్యాన్సర్ కేంద్రాలకు తరలించనున్నారు. దీని కోసం మూడు ప్రాంతాల్లో ప్రత్యేక క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 


వైద్యశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టిన చంద్రబాబు ముందుగా క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచాలని భావిస్తున్నారు. పెరిగిపోతున్న క్యాన్సర్‌ను ఆదిలోనే గుర్తించి మెరుగైన వైద్య సాయం అందేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకే ఇంటి వద్దే క్యాన్సర్ పరీక్షలు చేయనున్నారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి. అందుకే ఈ పరీక్షలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 


క్యాన్సర్ గుర్తించేందుకు మూడు రకాల పరీక్షలు చేస్తారు. దీనిలో పాజిటివ్ వచ్చిన వాళ్లను గుంటూరు, విశాఖ, కర్నూలులోని ఏదో కేంద్రానికి రిఫర్ చేస్తారు. అక్కడ వాళ్లకు మెరుగైన వైద్యం అందిస్తారు. క్యాన్సర్ తీవ్రంగా ఉంటే వేరే క్యాన్సర్ ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. 


పరీక్షలు చేస్తూనే క్యాన్సర్ రావడానికి ఉన్న మార్గాలేంటీ, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. దీని కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు.