అమరావతిలోని ఆర్‌5 జోన్‌లో ఇళ్ల పట్టాలు అందుకున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేసిన కేంద్రం వారికి ఇళ్లు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 8న ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడానికి మార్గం ఈజీ అయ్యింది. 


అట్టహాసంగా పంపిణీ


మే 26న అట్టహాసంగా అమరావతి ప్రాంతంలో భారీ ఎత్తున ఇళ్ళ పట్టాల పంపిణిని జగన్ సర్కారు ప్రారంభించింది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు వ్యవహరం తీవ్ర స్థాయిలో రాజకీయ వివాదానికి కారణమైంది.  దీని పై అధికార ,ప్రతి పక్షాల మద్య మాటల యుద్దం నడిచింది. 


ఒక్కొక్కరికి సెంటు స్థలం
 
సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో 51,392 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ లబ్ధిదారులంతా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందినవారు. వీళ్లకు ఒక్కొక్కరికి సెంటు స్థలాన్ని ఇంటి కోసం అందించింది ప్రభుత్వం. మొత్తం  25 లేఅవుట్లలో ప్లాట్లు కేటాయించింది. 


మహిళలకు మంచి జరగాలని వారి ముఖాల్లో ఆనందం చూడాలని ఒక గూడు ఏర్పడాలనే కృత నిశ్చయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగన్ చెప్పారు. అడ్డంకులన్నీ అధిగమించి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇంటి స్దలాన్ని కేటాయించామన్నారు జగన్.


కేంద్రానికి విపక్షాల లేఖలు


ఈ వివాదం కోర్టుల్లో ఉందని ఇళ్లు మంజూరుపై ఆలోచించాలని విపక్షాలు కేంద్రానికి లేఖలు రాశాయి. వీటిని పరిగణలోకి తీసుకోని కేంద్రం సీఆర్‌డీఏ పరిధిలో 47 వేలకుపైగా ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు రాష్ట్రానికి తెలియజేసింది. ఇంకా మూడు వేల ఇళ్లు మంజూరు కావాల్సి ఉంది. వాటిని కూడా త్వరలోనే మంజూరు చేస్తారని రాష్ట్రప్రభుత్వాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


విపక్షాలపై వైసీపీ ఆగ్రహం


కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో జులై 8న ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవ కార్యక్రమంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పంపిణీ సందర్భంగానే ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. మొదటి నుంచి సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, ప్రభుత్వం నుంచి విమర్శలు వస్తున్నాయి. వారి ఆరోపణలను కేంద్రం కొట్టేసిందని అంటున్నారు. 


సమస్యలు వస్తాయంటున్న విపక్షం


సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం యాజమాన్య హక్కులు లేని పత్రాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. కోర్టు కేసుల్లో ఉంటే ఇళ్లు కట్టుకోవడానికి ఎలా అనుమతిస్తారని.. ఇప్పుడు యాజమాన్య హక్కులు లేని పట్టాలు, ఇళ్లు భవిష్యత్‌లో సమస్యలు వస్తాయంటున్నాయి విపక్షాలు. పేదలకు ఇచ్చే స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న తర్వాత కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వారి సొమ్ము మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుందని వాదిస్తున్నాయి. కోర్టు తీర్పులు క్లియర్ అయిన తర్వాతే ప్రక్రియ చేపడితే ప్రభుత్వం నిజాయితీగా ఉందని ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.