AP Politics: ఏప్రిల్ నుంచి ముఖ్యమంత్రి విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని ప్రచారం జరుగుతోందని.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు తెలిపారు. ముఖ్యమంత్రి వచ్చి విశాఖలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తే ఎవరు అడ్డుకోలేరని అన్నారు. బీజేపీ మాత్రం విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఋషికొండలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత... ఇక్కడి నుంచే పరిపాలన ప్రారంభం కావొచ్చని చెప్పుకొచ్చారు. రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకుల్లో లేవని... మార్కెట్లలోను కనిపించడం లేదని... పెద్ద నోట్లను ఎవరు బ్లాక్ చేశారో తేల్చేందుకు ఆర్.బి.ఐ. విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతోందని విష్ణు కుమార్ రాజు ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. కేంద్రం పన్నుల ఆదాయానికి గండి పడింది కాబట్టి విచారణ చేయమని రాష్ట్ర బీజేపీ తరపున కోరతామన్నారు.
సీఎం సభకు హాజరయ్యే ప్రజలకు డ్రెస్ కోడ్ ప్రకటిస్తూ.. ప్రభుత్వం ఒక జీవో జారీ చెయ్యాలన్నారు. నరసాపురం సభకు వచ్చిన మహిళలతో చున్నీలు తీయించి వెయ్యడం సిగ్గు చేటన్నారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కళ్లకు ఈ చర్యలు తప్పుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. వాసిరెడ్డి పద్మకు నరసాపురంలో జరిగిన దారుణం కనిపించకపోవడం దారుణం అన్నారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం ఇక్కడ మా నాయకులను జైలు పాలు చేస్తుంటే సహించలేమన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో దశపల్లా భూములపై కలెక్టర్ కు ఒత్తిళ్లు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు చెప్పుకొచ్చారు.
మొన్నటికి మొన్న రోడ్ల పరిస్థితిపై ఫైర్...
రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి బాగోలేదని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. చివరికి ఆర్టీసీ బస్సు లోపల కూర్చున్న ప్రయాణికులు కూడా గొడుగు పట్టుకుని కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఇదేనా అభివృద్ధి అంటే అని ప్రశ్నించారు. అందుకేనా 175కి 175 సీట్లు కావాలని అడుగుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. హిట్లర్ ను దృష్టిలో పెట్టుకుని జగన్ స్ఫూర్తి పొందుతునట్టు అనిపిస్తోందని విమర్శించారు. ఇక్కడ బట్టన్ నొక్కడం కాదు... కేంద్రం నుంచి బట్టన్ నొక్కితే జగన్ పని అయిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నాయకులు రాజీనామా నాటకాలు ఆపాలని అన్నారు.
భూదందాలు, భూములను కొట్టేయడం తప్ప.. రాష్ట్రానికి వైసీపీ ఏం చేసిందని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ఏం చేసిందని అన్నారు. వైజాగ్ - చెన్నై పారిశ్రామిక కారిడార్ భూసేకరణ కూడా చెయ్యలేక పోయారని విమర్శించారు. ఈ కారిడార్ వస్తే విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాజీనామాలు చేస్తాం అని చెప్పిన వారు... విశాఖ అభివృద్ధి మీద చేసిన అభివృద్ధి ఏమిటో టీడీపీ, వైసీపీలు శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఈ రాష్ట్రంలో సొంత పార్టీని చూసుకోవడం మానేసి.. బీజేపీపై దృష్టి పెడుతూ.. రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.