మైలవరం వైసీపీ రాజకీయం రంజుగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చుట్టూ రాజకీయం ఆసక్తిగా సాగుతుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి జోగి రమేష్‌తో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన తండ్రి చేసిన వ్యాఖ్యలతో కూడా వసంత కృష్ణ ప్రసాద్‌పై ఒత్తిడి పెరిగిందని అంటున్నారు. చిన్నతనంలో మంత్రిగా తండ్రి ఉన్నప్పుడు ఆయనకు మాట రాకూడదని పద్దతిగా ఉండేవాడినని ఇప్పుడు తన తండ్రి కామెంట్స్ తనకు ఇబ్బందిగా మారాయని వసంత కృష్ణ ప్రసాద్ కామెంట్ చేశారు. 


జగన్‌తో మాట్లాడిన తరువాత స్పందిస్తా...
మైలవరం వైసీపీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా మంత్రి జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్ మధ్య విభేదాలు ఉన్నాయనే అంశం బహిరంగ రహస్యమే. అయితే తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ కూడ జోగితో ఉన్న విభేదాలపై స్పందించారు. అధినేత జగన్‌తో మాట్లాడిన తరువాతనే ఈ విభేదాలపై తాను మాట్లాడతానని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి వరకు విభేదాలపై ఉన్న ఊహగానాలు నిజమేనని వైసీపీ నేతలు, క్లారిటికి వచ్చారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతి అంశం రాజకీయంగా మారి ప్రతిపక్షాలకు అలుసుగా మారటం ఇష్టం లేకనే ఎక్కువగా మాట్లాడటం లేదని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.
 
మైలవరంలో వసంత...జోగి....
మైవలరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ గెలుపొందారు. అయితే ఎన్నికల సమయం వసంత కృష్ణ ప్రసాద్ ఆఖరి నిమిషంలో నియోజకవర్గంకు వచ్చారు. అప్పటి వరకు నియోజకవర్గ బాద్యతలను చూసిన జోగి రమేష్‌ను వైసీపీ నాయకత్వం పెడనకు పంపింది. జోగి రమేష్ స్థానంలో వసంత కృష్ణ ప్రసాద్‌కు జగన్ సీటు ఇవ్వటంతో వైసీపీ గాలిలో విజయం వరించింది. అయితే అప్పటి వరకు నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న జోగి రమేష్ కూడా పెడనకు వలస వెళ్లి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఇద్దరు నేతలు విజయం సాధించినప్పటికి మైలవరంపైనే ఎక్కువ ఆసక్తి ఉన్నా జోగి రమేష్‌కు వసంత కృష్ణ ప్రసాద్ రాక ఇష్టం లేదనే ప్రచారం ఉంది. 


అయితే క్యాడర్ అంతా జోగి రమేష్‌కు అందుబాటులో ఉండటంతో ఆయన చెప్పినట్లుగానే నియోజకవర్గంలో జరగాలని జోగి ప్రయత్నించేవారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మంత్రి అయిన తరువాత కూడా జోగి రమేష్ మైలవరం పైనే ఎక్కువ ఆసక్తి చూపించటం, నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు,పార్టీ వ్యవహరాలు, క్యాడర్ అంశాల్లో వేలు పెట్టటంతో ఇరువర్గాలకు మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. దీంతో జోగి రమేష్ వ్యవహరం నచ్చక, వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ అగ్రనేతల వద్ద పంచాయితీ పెట్టటం, ఈ వ్యవహరం మరింత ముదిరిందనే ప్రచారం ఉంది. 


నియోజకవర్గం నదీ తీరంలో ఉండటంతో ఇసుక పంచాయితీలో కూడా జోగి రమేష్ ఎంట్రీ ఇవ్వటంతో, వసంత కృష్ణ ప్రసాద్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవటానికి కారణం అయ్యిందని చెబుతున్నారు. ఎవరి నియోజకవర్గంలో వారు పనులు చేసుకుంటే ఇబ్బందులు ఉండవని, ఇలాంటి చిన్న చిన్న గొడవలతో ఇబ్బందిగా ఉందని పార్టీ అగ్రనేతలకు వసంత పలు మార్లు చెప్పినప్పటికి ప్రయోజనం లేదని అంటున్నారు.


మైలవరంలో దేవినేని ఉమానే టార్గెట్...


మైలవరం నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాను టార్గెట్ గా చేసుకొని వైసీపీ రాజకీయం నడుపుతుంది. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో అప్పటి వరకు నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్న జోగి రమేష్‌ను సామాజిక వర్గాల సమీకరణాల్లో పెడనకు పంపి, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్‌ను తెరమీదకు తెచ్చి సీటు ఇచ్చారు. అనుకున్నట్లే వైసీపీ టార్గెట్ చేసిన దేవినేని ఉమాను ఓడించారు. అయితే తానే స్వయంగా దేవినేని ఉమాపై పోటీ చేసి ఓడించే అవకాశం పోయిందని, జోగి రమేష్ అసహనంతో ఉన్నారని కూడా ఇప్పటికి ప్రచారం జరుగుతుంది. అదే ధ్యాసతో ఇప్పటికి మైలవరంపైనే జోగి రమేష్ ఎక్కువ శ్రద్ద చూపించటంతో, మైలవరం నుంచి గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్‌కు ఇబ్బందిగా మారింది. ఇక ఫిర్యాదు చేసినా, అదిష్టానం పట్టించుకోకపోవటం, ఆపైన జోగికి మంత్రి పదవి కూడా రావటంతో తప్పని పరిస్థితుల్లో వసంత కృష్ణ ప్రసాద్ మౌనంగానే భరిస్తున్నారని అంటున్నారు..