AP High Court News: ఏపీ సీఐడీ మోపిన ఏపీ లిక్కర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి (నవంబరు 27) వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌, చంద్రబాబు తరఫున నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్‌ గురువారం (నవంబర్ 23) వాదనలు వినిపించారు. ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ ప్రతిపాదన పంపారని, కమిషనర్‌ ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించిందని అడ్వకేట్ నాగముత్తు కోర్టుకు తెలిపారు. ఫైల్‌పై అప్పటి రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ సంతకాలు కూడా చేశారని గుర్తు చేశారు. ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చంద్రబాబు పర్సనల్ నిర్ణయం కాదని వాదించారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 27కి (సోమవారం) వాయిదా వేసింది.


ఈ మద్యం కేసులో చంద్రబాబును సీఐడీ ఏ-3గా చేర్చిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తికి చెందిన డిస్టిలరీస్‌కి చంద్రబాబు లబ్ధి చేకూర్చారనేది సీఐడీ చేసిన ఆరోపణ. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. 2015లో ప్రభుత్వం లిక్కర్ దుకాణాల విధానానికి ఓ సవరణ చేసింది. అందులో భాగంగా ఆ షాపులు చెల్లించే ప్రివిలైజ్ ఫీజును రద్దు చేయడం ద్వారా వారికి లబ్ధి చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. 


విధానం మార్చిన ప్రభుత్వం
అంతకుముందు ఉన్న రూల్స్ ప్రకారం అయితే.. ఒక ఏడాది కాలంలో లైసెన్స్ ఫీజుకి 10 రెట్లకు మించి లిక్కర్ కొంటే, ఆ ఫీజుపై అదనంగా కొన్న మొత్తంపై ప్రివిలైజ్ ఫీజు విధించేవారు. ఇది తమకు భారం కావడంతో వ్యాపారులు ఆ ఫీజు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై పరిశోధన చేసి ఆ ప్రివిలైజ్ ఫీజును రద్దు చేయాలని, అలా చేస్తే ఎక్కువ అమ్మకాలు జరిగి పన్నుల ద్వారా ప్రభుత్వానికి అధిక రాబడి వస్తుందని అంచనా వేశారు.


అంతా నిబంధనల ప్రకారమే - చంద్రబాబు న్యాయవాదులు
ఆ ప్రకారం 2015 జూన్‌ 17న జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశం ఆమోదం పొందింది. కేబినెట్‌ నిర్ణయానికి తగ్గట్లుగా అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ ఫైలు తయారు చేయగా.. ఆ ఫైలును అప్పటి రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ అజేయ కల్లం రెడ్డి పరిశీలించి సంతకం కూడా చేశారు. తుది ఆమోదం కోసం ఎక్సైజ్‌ శాఖ మంత్రికి పంపితే అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర దీనిపై సంతకం చేశారు. 


అయితే, ఈ ఫైల్‌ అసలు చంద్రబాబు వద్దకే వెళ్లలేదని, ఆయన అసలు సంతకమే చేయలేదని ఆయన తరపు లాయర్లు కోర్టులో వాదిస్తున్నారు. పైగా ఈ వ్యవహారం అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని చంద్రబాబు తరపు న్యాయవాదులు చెబుతున్నారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply