Minister Narayana on CM Chandrababu Tour: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు మొదటిసారిగా గురువారం అమరావతిని సందర్శించనున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా నాడు టీడీపీ హయాంలో చేపట్టిన భవన నిర్మాణ పనులను పరిశీలించనున్నట్లు ఏపీ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ  వెల్లడించారు. ముందుగా గత వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.   


సీఆర్ డీఏ ప్రాజెక్ట్ కార్యాలయ పరిశీలన
సీఆర్ డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం అక్కడే చంద్రబాబు మీడియాతో మాట్లాడతారని నారాయణ వెల్లడించారు.  కమిటీలు వేసి అమరావతిలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని ఆయన వివరించారు. టెండర్ల కాలపరిమితి ముగియడంతో కొత్తగా అంచనాలను తయారు చేసి మళ్లీ  టెండర్లు పిలవాల్సి ఉందన్నారు. దీనికోసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందన్నారు. పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది కేబినెట్‌లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే రాజధానిలో ఫర్నీచర్ దొంగిలించిన వారిపై  చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  


నిర్లక్ష్యంగా వ్యవహరించిన  గత ప్రభుత్వం
అమరావతి రాజధాని శిలాఫలకంతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్జిలు, అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను చంద్రబాబు పరిశీలిస్తారని మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీ హాయం(2014-19)లో  అనేక పనులు చేశామని ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు.  రాజధానిలో చేపట్టిన  నిర్మాణ పనులు మరమ్మతులకు లోనయ్యాయని, వీటిని పూర్తి చేసేందుకు గాను కమిటీలను నియమించి వ్యయ ప్రతిపాదనలను తయారు చేస్తామన్నారు. నిర్మాణ సంస్థలకు  రీ టెండరింగ్‌ అంశం కేబినేట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.  


ఇళ్ల స్థలాలపై మంత్రి స్పందన
 అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై మంత్రి నారాయణ స్పందించారు. గత ప్రభుత్వం రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చిందని, ఆ అంశం సుప్రీంకోర్టులో ఉందన్నారు. అందుకు న్యాయసలహా తీసుకుంటామన్నారు.  రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుంటుదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.



సింగపూర్ మాస్టర్ ప్లాన్ సాయంతో రాజధాని నిర్మాణం
టీడీపీ నేతలు మాట్లాడుతూ ‘మంచి లక్ష్యంతో నాడు అమరావతి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు తలపెట్టారు. 8603 చ.కి.మీ పరిధిలో రాజధాని ప్రాంతం, 217 చ.కి.మీ పరిధిలో రాజధాని నగరం, 16.9  చ.కి.మీ పరిధిలో కోర్ క్యాపిటల్ ఏరియా ఏర్పాటయ్యే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు.  58 రోజుల్లో రైతుల నుంచి భూ సమీకరణ చేశారు. ప్రజల, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 54 వేల ఎకరాలు రాజధాని కోసం సేకరించారు. భూ సమీకరణకు 29, 881 మంది రైతులు 33 వేల ఎకరాలకు పైగా త్యాగం చేశారు. నిర్మాణాలు, రహదారులు, డ్రైనేజీ, ఇతరత్రా అన్నీ పోను ప్రభుత్వానికి ఎనిమిది వేల ఎకరాలు మిగిలేలా ప్రణాళికలు రూపొందించారు.


2015 అక్టోబర్ 22న ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిగింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిలో 32 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 14 శాతం, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు 20 శాతం ఉండగా, కమ్మ సామాజిక వర్గం 18 శాతం, కాపులు 9 శాతం, ముస్లింలు 3 శాతం ఉన్నారు. ప్రజా ప్రతినిధుల భవనాల కోసం, 12 టవర్లు 288 ప్లాట్లు నిర్మించారు. ఐఎస్ఎస్, ఐపీఎస్ క్వార్టర్లకు ఆరు టవర్లు, 144 ఫ్లాట్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని’ వివరించారు.