Free Books For Inter Students: ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (Government Junior Colleges) చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటర్ మెుదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్‌ల్లో చదివే విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనుంది.


రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,08,619 మందికి, రెండో సంవత్సరంలో 92,134 మంది విద్యార్థులు చదవుతున్నారు. వీరందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు అందజేయనుంది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు(జీవో) జారీ చేశారు. జులై 15లోగా వారందరికీ పంపిణీ చేయాలని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న రెండు లక్షల మందిపైగా పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. త్వరలోనే పుస్తకాలు పంపిణీ కూడా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం తెలుగు అకాడమీ నుంచి పాఠ్యాపుస్తకాలను సరఫరా చేయనున్నారు. ఇందుకోసం నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ను నియమించారు. మరోవైపు ప్రస్తుతం స్టాక్స్ ఉన్న పుస్తకాలను విద్యార్థులకు తక్షణమే అందజేయాలని, ఒకవేళ సరిపడా పుస్తకాలు లేకుంటే వెంటనే  ప్రింటింగ్ కోసం అనుమతివ్వాలని ఏపీ విద్యాశాఖ సూచించింది. 


మాట ఇచ్చిన 3 రోజుల్లోనే హామీ అమలు..
ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ (Education Minister Nara Lokesh) ఇటీవల బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే విద్యాశాఖపై సంబంధిత అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై చర్చించారు. స్కూళ్లలో డ్రాపౌట్స్, మధ్యాహ్న భోజనం నాణ్యత సహా పలు అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ విద్యనభ్యసించే విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వడం నిలిపివేసిందని తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు. పుస్తకాలు లేకుండా పేద విద్యార్థులు ఎలా చదువుతారని ఆ సమావేశంలోనే అధికారులను ప్రశ్నించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు 12 నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని లోకేష్ ఆదేశించడంతో అధికారులు ఆగమేగాలపై జూన్ 18న ఉత్తర్వులు (జీవో MS No.28) విడుదల చేశారు. మంత్రి లోకేష్ మాట ఇచ్చిన 3 రోజుల్లోనే దీనిపై ఉత్తర్వులు జారీకావడం విశేషం.


త్వరలో 'మెగా డీఎస్సీ' నోటిఫికేషన్..
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. సీఎంగా చంద్రబాబు అధికార పట్టాలు చేపట్టగానే 16,347 ఉద్యోగాలకు సంబంధించిన 'మెగా డీఎస్సీ'దస్త్రంపై తొలి సంతకం పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాత నోటిఫికేషన్ రద్దుకాగా.. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు కూడా జారీచేశారు. అయితే గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది అభ్యర్థులు మళ్లీ అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మాత్రం అవకాశం కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాలపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..






మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..