AP DSC 2024 Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం 6,100 పోస్టులతో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం (జూన్ 13) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంగా చంద్రబాబు అధికార పట్టాలు చేపట్టగానే 16,347 ఉద్యోగాలకు సంబంధించిన 'మెగా డీఎస్సీ'దస్త్రంపై తొలి సంతకం పెట్టారు. దీంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది అభ్యర్థులు మళ్లీ అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మాత్రం అవకాశం కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాలపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.
కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ జూన్ 13న అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో డీఎస్సీ ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియ 6 నెలల్లోపే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది.
మెగా డీఎస్సీ పోస్టుల వివరాలు ఇలా..
గత ప్రభుత్వం విడుదలచేసిన డీఎస్సీని సవరించి టీడీపీ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఖాళీలపై గత రెండు, మూడు రోజులుగా పాఠశాల విద్యాశాఖ అధికారులు వివరాలు సేకరించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిప్రకారం.. 16347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు.
కొత్త నోటిఫికేషన్ ద్వారా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు.
మెగా డీఎస్సీ పోస్టుల వివరాలు..
క్ర.సం. | విభాగం | పోస్టుల సంఖ్య |
1) | స్కూల్ అసిస్టెంట్ (SA) | 7725 |
2) | సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) | 6371 |
3) | ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) | 1781 |
4) | పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) | 286 |
5) | ప్రిన్సిపల్స్ | 52 |
6) | ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) | 132 |
- | మొత్తం ఖాళీలు | 16,347 |
ఏపీలో 6100 టీచర్ పోస్టులతో ఫిబ్రవరి 12న డీఎస్సీ-2024 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్ అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ నోటిఫికేషన్‌లో గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను రద్దుచేసింది.
ALSO READ:
➥ 'డీఎస్సీ' అభ్యర్థులకు అలర్ట్, 'టెట్' మార్కుల నమోదుకు, దరఖాస్తుల సవరణకు అవకాశం