Kuwait Fire Accident: కువైట్ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది మృతదేహాలను కేరళ తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ ఫ్లైట్ కొచ్చిన్‌లో ల్యాండ్ అయింది. మృతుల్లో ముగ్గుర ఏపీ వాసులు కూడా ఉన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో 50 మంది మృతి చెందారు. వీళ్లలో 45 మంది భారతీయులే. కేరళతో పాటు తమిళనాడు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాళ్లూ ఉన్నారు. రెండు రోజులుగా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది భారత విదేశాంగ శాఖ. మిగతా బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కేంద్రమంత్రి కృతి వర్ధన్ సింగ్ కువైట్‌కి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఆ తరవాతే మృతదేహాలను భారత్‌కి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. IAFకి చెందిన ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లో వీళ్ల డెడ్‌బాడీస్‌ని తరలించాలని నిర్ణయించారు. ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వడానికి ముందే కొచ్చిని ఎయిర్‌పోర్ట్‌లో ఆంబులెన్స్‌లు సిద్ధమయ్యాయి.
బిల్డింగ్‌లో ఘోర ప్రమాదం..
ఈ నెల 12వ తేదీన తెల్లవారుజామున మంగాఫ్ సిటీలోని ఓ ఆరంతస్తుల బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కింది అంతస్తులోని కిచెన్‌లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి భవనమంతా వ్యాపించాయి. అపార్ట్‌మెంట్ వాసులు అప్రమత్తమై వెంటనే బయటకు వచ్చారు. కొందరు మాత్రం అలా మంటల్లోనే చిక్కుకున్నారు. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారులు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయినా 50 మంది చనిపోయారు. వీళ్లతో 45 మంది భారతీయులే ఉండడం కలకలం రేపింది. ఈ అపార్ట్‌మెంట్‌లో దాదాపు 176 మంది భారతీయులే ఉన్నారు. అంతా ఒకే కంపెనీలో పని చేస్తున్న కూలీలు. 45 మంది చనిపోగా 33 మంది ఆసుపత్రి పాలయ్యారు. బాధితుల్లో 24 మంది కేరళకు చెందిన వాళ్లే. ఏడుగురు తమిళనాడు వాళ్లు కాగా, ముగ్గురు యూపీ వాళ్లున్నారు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బిహార్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వాళ్లూ ఉన్నారు. కేంద్రమంత్రి కృతి వర్ధన్ సింగ్ కువైట్‌లోని ఐదు హాస్పిటల్స్‌ని సందర్శించారు. అక్కడి బాధితులను పరామర్శించారు. వీళ్లలో కొందరు కుదుటపడ్డారు. త్వరలోనే వాళ్లని డిశ్చార్జ్ చేస్తామని అధికారులు వెల్లడించారు. కొంత మంది అగ్నికి ఆహుతి కావడం వల్ల వాళ్లని గుర్తించడం సాధ్యపడలేదు. DNA టెస్ట్ ఆధారంగా వాళ్ల వివరాలు తెలుసుకున్నారు.
Also Read: Interchange Fee: ఏటీఎమ్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిదేమో, ఇకపై ఛార్జీల బాదుడు అలా ఉంటుందట మరి!