TG DSC Application Edit: తెలంగాణలోని టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2024కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలకమైన సమాచారం ఇచ్చింది. టెట్ ఫలితాలను జూన్ 12న వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎస్సీ-2024 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 'టెట్' మార్కుల వివరాల సమర్పణకు సంబంధించి 'ఎడిట్' ఆప్షన్‌ను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు టెట్ స్కోర్‌తో పాటు ఇత‌ర వివ‌రాల‌ను కూడా సవరించుకునేందుకు విద్యాశాఖ అవ‌కాశం క‌ల్పించింది. అదేవిధంగా టెట్‌-2024లో అర్హత సాధించిన అభ్యర్థులు ఒక‌సారి డీఎస్సీ ప‌రీక్షకు ఉచితంగా ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశాన్ని ప్రభుత్వం క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటివరకు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోలేకపోయిన, కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.






జూన్ 20తో ముగియనున్న డీఎస్సీ దరఖాస్తు గడువు...
తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులు 6,508; స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 2,629; లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727; పీఈటీ పోస్టులు 182; స్పెషల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్) పోస్టులు 220; స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎస్జీటీ) పోస్టులు 796 ఉన్నాయి. డీఎస్సీ కంటే ముందుగా టెట్ నిర్వహించాలన్నా హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం టెట్ నిర్వహించి తాజాగా ఫలితాలను కూడా విడుదల చేసింది. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు డీఎస్సీ దరఖాస్తుల్లో టెట్ స్కోరును నమోదుచేయాల్సి ఉంటుంది. టెట్ స్కోరుతోపాటు, ఇతర వివరాలనూ సవరించుకునే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది.


ప్రస్తుతం డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 20తో దరఖాస్తు గడువు ముగియనుంది. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. టెట్-2024లో అర్హత సాధించినవారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు.  ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.  మొత్తం 15 రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు దరఖాస్తుల సంఖ్య దాదాపు 2.2 లక్షల వరకు ఉంది. జూన్ 12న టెట్ ఫలితాలు వెలువడటంతో.. డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. 



తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


ALSO READ: తెలంగాణ టెట్-2024 తుది ఆన్సర్ 'కీ' విడుదల, రిజల్ట్ తర్వాత 'కీ' రిలీజ్‌పై విమర్శలు


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..