TGTET 2024 Final Answer Key: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET) ఫలితాలు జూన్ 12న మధ్యాహ్నం విడుదలైన సంగతి తెలిసిందే. టెట్ తుది ఆన్సర్ కీని జూన్ 12న సాయంత్రం విడుదల చేశారు. అయితే ఫలితాలు విడుదలయ్యాక ఫైనల్ కీ విడుదల చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఒక రోజు ముందుగానే తుది ఆన్సర్ 'కీ'ని విడుదల చేస్తారు. గతంలోనూ ఫైనల్‌ కీ విడుదల చేసిన తర్వాతే ఫలితాలను ప్రకటించేవారు. కానీ ఇందుకు భిన్నంగా ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఫైనల్‌ కీని అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దీంతో అధికారుల తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 


TGTET- 2024 ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..


ఇక టెట్-2024 ఫలితాల విషయానికొస్తే.. పరీక్ష కోసం మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 (67.13%) అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 (34.18%) అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం అర్హత పెరగడం గమనార్హం. గత టెట్‌తో పోల్చితే.. పేపర్‌-1లో 30.24 శాతం, పేపర్‌-2లో 18.88 శాతం ఉత్తీర్ణత పెరగడం విశేషం. 


ప్రభుత్వ టీచర్లు సగమే అర్హత..
టెట్-2024 ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అభ్యర్థుల్లో సగం మాత్రమే అర్హత సాధించారు. మొత్తం 33 వేల మంది ఇన్‌సర్వీస్ టీచర్లలో కేవలం 18 వేల మంది మాత్రమే అర్హత సాధించారు. మొత్తం 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మిగతా 15 వేల మంది టీచర్లు అనర్హులుగా మిగిలారు. ఇక సబ్జెక్టులవారీగా చూస్తే అత్యధికంగా పేపర్‌-2 సోషల్‌లో 56 శాతం, పేపర్‌-2 గణితంలో 49 శాతం, సైన్స్‌లో 49 శాతం టీచర్లు అర్హత సాధించలేకపోయారు. ఇక పేపర్‌-1లో 21శాతం టీచర్లు టెట్‌లో క్వాలిఫై కాలేదు.


అభ్యర్థులకు ఉపశమనం.. 
టెట్-2024లో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అభ్యర్థులు తర్వాత రాయబోయే టెట్‌కు (డిసెంబర్‌ టెట్‌) ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. అదేవిధంగా టెట్-2024 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత నిర్వహించబోయే.. ఉపాధ్యాయ నియామక పరీక్షకు (డీఎస్సీ) ఒకసారి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది .


డీఎస్సీ దరఖాస్తుకు మరో వారమే గడువు..
టెట్-2024 ప్రక్రియ పూర్తికావడంతో.. తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 20తో దరఖాస్తు గడువు ముగియనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు దరఖాస్తుల సంఖ్య దాదాపు 2.2 లక్షల వరకు ఉంది. జూన్ 12న టెట్ ఫలితాలు వెలువడటంతో.. డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.



తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..