Today Top Headlines In Telugu States:


1. తిరుమల శ్రీవారి సేవలో ఏపీ సీఎం చంద్రబాబు


ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. వైకుంఠ క్యూకాంప్లెక్స్ వద్ద చంద్రబాబును చూసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తూ ఆయన ముందుకు ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.


2. సీఎం చంద్రబాబు ఆన్ డ్యూటీ


ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) గురువారం సాయంత్రం 4:41 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం ఛాంబర్‌లో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల పర్యటన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేస్తారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. అలాగే, స్కిల్ సెన్సస్ ప్రక్రియ (నైపుణ్య గణన), అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేస్తారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు దస్త్రాలు సిద్ధం చేశారు. 


3. ఏపీలో మంత్రుల శాఖలపై స్పష్టత


ఏపీలో మంత్రుల శాఖలపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన అనంతరం అమరావతికి చేరుకుని మంత్రుల శాఖలకు సంబంధించి ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే శాఖలపై కసరత్తు పూర్తి చేసిన ఆయన.. అమాత్యులకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ పర్యావరణ శాఖలు కేటాయించినట్లు సమాచారం. 


4. ఏపీలో పాఠశాలలు ప్రారంభం


సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత గురువారం ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం.. కొత్త విద్యా సంవత్సరంతో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్‌ను విద్యా శాఖ ఇప్పటివరకూ విడుదల చేయలేదు. త్వరలో సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి ఫొటోలతో త్వరలోనే అకడమిక్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. విద్యార్థులందరికీ కిట్స్ అందించే విధంగా విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.


5. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు


తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఎంపికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు శాస్త్రి భవన్‌లో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి, ఉదయం 10:35 గంటలకు నార్త్ బ్లాక్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అటు, ఏపీకి చెందిన ఎంపీలు కింజరాపు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మలు గురువారం లేదా శుక్రవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.


6. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు


తెలంగాణలో నైరుతి రుతు పవనాల విస్తరణతో గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు.


7. ప్రధాని మోదీ ఇటలీ పర్యటన


ప్రధాని మోదీ గురువారం ఇటలీ వెళ్లనున్నారు. జీ 7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇటలీలో పర్యటించనున్నారు. పీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన. 3 రోజుల పాటు జరిగే సదస్సులో రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, కెనడా పీఎం ట్రూడో తదితరులు పాల్గొన్నారు.


8. 'నీట్'పై సుప్రీంలో విచారణ


ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ - యూజీ 2024 ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం నిర్వహించనుంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలు జరిగాయని అబ్దుల్లా మహమ్మద్ ఫైజ్, కార్తీక్ వేర్వేరు పిటిషన్లు వేశారు. వీరితో పాటు కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై 'ఫిజిక్స్ వాలా' విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


9. పవన్ కల్యాణ్‌కు ఉపాసన విషెష్


జనసేనాని పవన్ కల్యాణ్ బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య పవన్‌కు ట్విట్టర్ వేదికగా విషెష్ చెప్తూ బాబాయ్ అని అన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ చేతులను పట్టుకుని అభివాదం చేశారు. ఈ ఫోటోను షేర్ చేసిన ఉపాసన ‘కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ బాబాయ్. జనాలు చాలా బాగా ఆలోచించి జనసేన పార్టీని ఎన్నుకున్నారు. జై హింద్’ అంటూ ట్వీట్ చేశారు.


10. సూపర్ - 8లో టీమిండియా


టీ 20 ప్రపంచ కప్‌‌లో టీమిండియా సూపర్‌ 8లోకి దూసుకెళ్లింది. ఆతిథ్య అమెరికా(USA) తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి రోహిత్ సేన సూపర్‌ 8లో ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెరికా 110 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి భారత్‌కు కూడా షాక్‌ ఇచ్చింది. అయితే, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే విజృంభణతో పది బంతులు మిగిలుండగానే భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలో గ్రూప్‌ ఏలో పోరు రసవత్తరంగా మారింది. ఇక మిగిలి ఉన్న ఒక్క బెర్తు కోసం అమెరికా- పాకిస్థాన్‌ పోటీ పడుతున్నాయి.