GV Prakash Birthday Special: మామూలుగా తెర వెనుక ఉండి సినిమాను నడిపించేవారు తెరపైకి రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం అటు ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఇటు ఆన్ స్క్రీన్ కూడా సక్సెస్‌ను అందుకున్నాడు. తను మరెవరో కాదు జీవీ ప్రకాశ్. ఒకవైపు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్‌గా మ్యాజిక్ చేస్తూనే మరోవైపు యాక్టర్‌గా కూడా అందరినీ ఆకట్టుకుంటున్న జీవీ ప్రకాశ్ పుట్టినరోజు నేడు (జూన్ 13). చిన్న వయసులోనే ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న జీవీ.. తాజాగా తన విడాకుల వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇది మాత్రమే కాకుండా ప్రేక్షకులు తన గురించి తెలుసుకోవడానికి మరెన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.


తమిళ డబ్బింగ్ పాటలు..


గత పదేళ్లలో జీవీ ప్రకాశ్.. 50కు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. దాదాపు 30 సినిమాల్లో హీరోగా కనిపించాడు. 34 ఏళ్ల వయసున్న జీవీ.. ముందుగా తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. 2006లో విడుదలయిన ‘వెయిల్’ అనే మూవీతో మ్యూజిక్ డైరెక్టర్‌గా డెబ్యూ చేశాడు జీవీ ప్రకాశ్. అప్పుడు తన వయసు 18 ఏళ్లే. ‘వెయిల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేదు. కానీ అందులోని పాటలు మాత్రం మంచి హిట్ అయ్యాయి. దానివల్లే జీవీ ప్రకాశ్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా మొదటి బ్రేక్ దక్కింది. తను అందించిన చార్ట్‌బస్టర్స్‌లో మరొకటి ‘మద్రాసిపట్టణం’. ఆర్య, ఎమీ జాక్సన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగులో కూడా డబ్ అయ్యింది. తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా ఈ సినిమా పాటలకు చాలా క్రేజ్ ఉంది.


ఎన్నో ఫీల్ గుడ్ ఆల్బమ్స్..


ధనుష్, వెట్రిమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆడుకులం’ మూవీకి కూడా జీవీ ప్రకాశే సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకు తను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నాడు. జీవీ ప్రకాశ్ ఖాతాలో ‘సురరాయ్ పొట్రూ’, ‘తేరీ’ లాంటి చిత్రాలు కూడా ఉన్నాయి. తెలుగులో కూడా పలు చిత్రాలకు ఫీల్ గుడ్ మ్యూజిక్‌ను అందించి తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు జీవీ. ముఖ్యంగా ‘డార్లింగ్’ మూవీకి జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్‌కు జీవీ ప్రకాశ్‌కు బంధుత్వం ఉంది. జీవీ తల్లి రీహానా.. రెహ్మాన్‌కు అక్క. అంతే కాకుండా ఆమె కూడా ఒక ప్లేబ్యాక్ సింగర్. అందుకే ఏఆర్ రెహమాన్ పనిచేసిన పలు ప్రాజెక్ట్స్‌కు జీవీ ప్రకాశ్ అసిస్టెంట్‌గా వ్యవహరించాడు. హరీష్ జయరాజ్ లాంటి సీనియర్స్‌తో కూడా కలిసి పనిచేశాడు.


మొదటి సినిమాతోనే అవార్డ్..


మ్యూజిక్ డైరెక్టర్‌గా సక్సెస్ సాధించిన జీవీ ప్రకాశ్.. చిన్నప్పుడు ఇంజనీర్ లేదా క్రికెటర్ అవ్వాలని అనుకునేవాడట. 2015లో తమిళ సినిమా ‘డార్లింగ్’తో మొదటిసారి హీరోగా వెండితెరపై వెలిగాడు జీవీ ప్రకాశ్. హీరోగా తన మొదటి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూ కూడా ఏడాదికి దాదాపు అరడజను సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు జీవీ ప్రకాశ్. మామూలుగా తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడని జీవీ.. తాజాగా తన భార్య సైంధవికి విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. ఒకే స్కూల్‌లో చదువుకున్న సైంధవి, జీవీ చిన్నవయసులోనే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. 11 ఏళ్ల పాటు కలిసున్న తర్వాత విడాకులను ప్రకటించారు.


Also Read: నటి వరలక్ష్మి పెళ్లి జరిగేది ఈ దేశంలోనే - అక్కడ గ్రాండ్ వెడ్డింగ్‌కి భారీగా ఏర్పాట్లు..