Capital Amaravato : ఏపీ సీఎం చంద్రబాబు అ గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి పర్యటన ప్రారంభం కానుంది. రాజధాని నిర్మాణాలు, శంకు స్ధాపన జరిగిన ప్రాంతాన్ని ఈ సందర్భంగా సీఎం సందర్శించనున్నారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు సంబంధించిన సైట్లు సీఎం పరిశీలించనున్నారు. రాజధాని ప్రాంతంలోని వివిధ నిర్మాణాల స్థితిగతులను తెలుసుకోనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలు పెట్టిన సైట్ లను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు.
రెండున్నరేళ్లలో మొదటి దశ పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ
ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. మున్సిపల్ మంత్రి నారాయణ అమరావతి తొలి దశను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. రాజధాని అభివృద్ధికి తొలిదశలో రూ.48 వేల కోట్లతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి దాదాపు రూ.9 కోట్లు చెల్లింపులు కూడా గతంలో చేశారు. అమరావతిని ప్రపంచంలోనే తొలి ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉత్తమమైన డిజైన్‌ను రూపొందించామని ప్రభుత్వం ప్రకటించింది.
కీలక భవనాల నిర్మాణాలు చివరి దశలో
రాజధానిలో మెజార్టీ ప్రాంతం కవరయ్యేలా మౌలిక వసతుల కల్పనతోపాటు మంత్రులు, కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగుల నివాసాలకు సంబంధించి భవనాల నిర్మాణానికి తొలిదశలో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. మంత్రుల కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగుల నివాసాలకు సంబంధించి భవనాల నిర్మాణం కూడా 90 శాతం పూర్తయ్యాయి. తొలిదశ పనులతో సిటీ నిర్మాణ పనులు పూర్తవుతాయి. రెండో దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు చేపడతారు.
చంద్రబాబు పరిశీలన తర్వాత కీలక నిర్ణయం
రాజధాని నిర్మాణంతో పాటు ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, సచివాలయం, గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల నివాసాలు, హైకోర్టు, ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జిల నివాసాలు ఇలా అడ్మినిస్ట్రేటవ్ సిటీలో దాదాపు ఐదారు కిలోమీటర్ల పొడవున భారీ నిర్మాణాలను చేపట్టారు. 2019లో ప్రభుత్వం మారిపోయే సమయానికి వీటిలో చాలా వరకు పూర్తయ్యాయి. అధికారుల క్వార్టర్లు చివరి దశకు చేరాయి. ఆలిండియా సర్వీస్ అధికారుల క్వార్టర్లు బస చేయడానికి వీలుగా రూపొందాయి. వీటన్నింటినీ చంద్రబాబు పరిశీలించి.. వీలైనంత త్వరగా పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోనున్నారు.
పాత కంపెనీలతో మళ్లీ పనులు ప్రారంభిస్తారా లేకపోతే కొత్త టెండర్లు పిలుస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.