AP Minister Nara Lokesh about Talliki Vandanam Scheme | అమరావతి: ‘ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంసం నుంచి ఏపీ వికాసం వైపు అడుగులు వేస్తోందని’ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం చంద్రబాబు పాలనతో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుందన్నారు. స్కూల్, ఇంటర్ విద్యార్థుల తల్లులకు ఒక్కొ విద్యార్థికి రూ.13 వేలు చొప్పున వారి ఖాతాల్లో జమచేస్తామన్నారు.


డీఎస్సీని అడ్డుకోవాలని వైసీపీ కుట్ర


ఉద్యోగాల విషయానికొస్తే మెగా డీఎస్సీ ద్వారా 16347 పోస్టులు భర్తీ చేస్తున్నాం. మెగా డీఎస్సీని ఆపాలని ప్రతిపక్షాలు 24 కేసులు వేయగా సుప్రీంకోర్టులో సైతం కేసు కొట్టివేశారు. గడిచిన 10 ఏళ్లలో రాని పెట్టుబడులు ఈ ఒక్క ఏడాదిలో తీసుకొచ్చాం. 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు 8.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. పలు దశలలో పెట్టుబడులున్నాయి. డొమెస్టిక్ పెట్టుబడుల్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. 16 శాతం డొమెస్టిక్ పెట్టుబడులతో అగ్ర స్థానంలో ఉన్నాం. టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, రిలయన్స్ లాంటి పలు అగ్ర సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి అందుకు డబుల్ ఇంజిన్ సర్కారే కారణం. భోగాపురం ఎయిర్ పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. 


దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకే దశలో పింఛన్లు భారీ మొత్తంలో పెంచాం. దేశంలో అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వృద్ధులకు 1000 రూపాయలు, వికలాంగులకు 3000 పెంచాం. 203 అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తాం. దీపం పథకం ద్వారా 2 కోట్ల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందించాం. కొన్ని సవరణలు తీసుకొచ్చి నగదు మహిళల ఖాతాల్లో జమ చేయనున్నాం. 






ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎంత మంది పిల్లలుంటే వారికి నగదును తల్లుల ఖాతాల్లో వేయనున్నాం. రూ.13 వేలు తల్లుల ఖాతాల్లో, రూ.2 వేలు స్కూల్,, ఇతర మెయింటెన్స్ గ్రాంట్ కింద ఆ నిధులు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సంక్షేమం, అభివృద్ధి అనేవి జోడెద్దుల్లాంటివి. 60 శాతం కుటుంబాలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలుంటే రూ.26 వేలు, ముగ్గురుంటే రూ.39 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం. ప్రజలు 94 శాతం సీట్లతో కూటమి పార్టీలకు విజయాన్ని అందించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. నేడు సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభిస్తామని’ చెప్పుకొచ్చారు.