ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మధ్య ఏర్పడిన చిన్నపాటి గ్యాప్ సెట్ చేసేందుకు టాలీవుడ్ పెద్దలు రెడీ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. ఈ ఆదివారం అమరావతి వెళ్లి సీఎంను కలిసి చిత్రసీమ సమస్యలతో పాటు ఏపీ ప్రభుత్వం నుంచి తాము ఆశిస్తున్న సహాయ సహకారాలు గురించి వివరించాలని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో...బాలకృష్ణను సంప్రదించి లిస్ట్!Tollywood Film Industry Biggies to Meet AP CM: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును టాలీవుడ్ పెద్దలు కలవనున్నారు. సుమారు 45 మంది వరకు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. అమరావతిలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎంతో టాలీవుడ్ పెద్దల సమావేశం ఖరారు అయింది.
ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించేందుకు ప్రభుత్వ అధికారులు లేదా ముఖ్యమంత్రులు కలిసే సమయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి లిస్టు ఎంపిక చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి మాత్రం ఛాంబర్ ఎంపిక చేసిన లిస్ట్ కాకుండా... గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణను, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను సంప్రదించి లిస్ట్ ఎంపిక చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్.
పవన్ సూచించిన మార్పులు...టాలీవుడ్ సమస్యల మీద చర్చ!'హరిహర వీరమల్లు' విడుదల వాయిదా పడటానికి ముందు థియేటర్స్ బంద్ చేయాలని కొంత మంది ఎగ్జిబిటర్లు తెర వెనుక పావులు కదిపారని ప్రచారం జరిగింది. దానిపై విచారణ చేయాలని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించిన విషయం తెలిసిందే. వాట్సాప్ గ్రూపులో వీరమల్లుకు వ్యతిరేకంగా కొందరు చేసిన డిస్కషన్ పవన్ వరకు చేరిందని 'బన్నీ' వాసు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దాంతో పవన్ కొంచెం ఘాటుగా స్పందించారు. తనకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ స్వీకరిస్తున్నానని, ఏపీ డిప్యూటీ సీఎంవో కార్యాలయం నుంచి వచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు టాలీవుడ్ ప్రముఖుల్లో కదలిక వచ్చింది. పవన్ సూచించిన మార్పులతోపాటు టాలీవుడ్ సమస్యల మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వీరమల్లు విడుదల మీద 'ఆ నలుగురు' కుట్ర చేశారని బలంగా ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో నేను లేనని అల్లు అరవింద్ తెలిపారు. ఆ వెంటనే 'దిల్' రాజు కూడా సమావేశం ఏర్పాటు చేసి తాను కూడా ఆ నలుగురులో లేనని స్పష్టం చేశారు. జూన్ 20వ తేదీన తాను నిర్మించిన 'కుబేర' విడుదలకు సిద్ధం అవుతుండగా థియేటర్లు బంద్ చేయడానికి తాను ఎందుకు ప్రోత్సహిస్తానని సునీల్ నారంగ్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు సురేష్ బాబు ఎటువంటి విలేకరుల సమావేశం నిర్వహించలేదు.