జూన్ 21న జరిగే యోగా డే ఈసారి మన వైజాగ్ లో జరగబోతుంది. దీనికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇటీవల అమరావతి పనులకు మరోసారి శంఖుస్థాపన  చేసిన సమయం లో ప్రధాని మరోసారి ఏపీకి వస్తానని మాట ఇచ్చారు.  అన్నట్టుగానే ఆయన ఏపీకి వస్తున్నారు. దానికి వేదికగా  లో జరిగే యోగా డే ని ఆయన ఎన్నుకున్నారు . దానితో ఈసారి యోగా డే అత్యంత  స్పెషల్ గా ఉండాలని  ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 

5 లక్షల మంది తో యోగా - గిన్నిస్ రికార్డ్ టార్గెట్ 

 వైజాగ్ లో జూన్ 21న జరిగే యోగ డే  గిన్నీస్ రికార్డ్స్  తో  నిలిచిపోవాలని  ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. విశాఖపట్నం నుండి భీమిలి వరకు  ఉన్న బీచ్ రోడ్ లో  5 లక్షల మందితో  ఒకేసారి యోగాసనాలు వేయించేలా  ప్రణాళికలు రచించింది.  దీనికోసం   నారా లోకేష్ సహా  మంత్రులు కందుల దుర్గేష్ , వంగలపూడి అనిత, సంధ్యారాణి లాంటివాళ్లు వైజాగ్ లో పలుమార్లు పర్యటించి  అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు.

యోగాడే  రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖవైపు చూస్తోంది : నారా లోకేష్

 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే వైజాగ్ యోగాంధ్ర కార్యక్రమం అత్యంత కీలకమైందని అన్నారు మంత్రి లోకేష్, ఆరోజున ఏపీ సాధించబోయే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ మహానగరం వైపు చూస్తోందనీ ప్రధాని మోడీజీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆయన విజ్ఞప్తిచేశారు. ఆంధ్రా యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాలులో ఈనెల 21న యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.  

ఈనెల 21న ఆర్ కె బీచ్ నుంచి భీమిలి వరకు 26 కి.మీ.ల పొడవున 247 కంపార్ట్ మెంట్లలో నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలనీ, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేసారు.ఆరోజు ఉదయం 6.30గంటలకు ప్రధాని ఆర్ కె బీచ్ ఖాళీమాత ఆలయం వద్ద ప్రధాన ప్రాంగణానికి చేరుకుంటారు. అంతకు గంటముందే ప్రజలంతా ఆయా కంపార్ట్ మెంట్లకు చేరేలా రవాణా సౌకర్యం కల్పించాలని. సుదూర ప్రాంతాల్లో నిలిపివేసి వారిని ఇబ్బందులకు గురిచేయొద్దనీ, 600 మీటర్లకు మించి ప్రజలను నడిపించకుండా వాహనాలను వదలాలని.. ప్రజలను ఇళ్లవద్ద నుంచి ప్రాంగణానికి, అక్కడి నుండి తిరిగి వారు ఇంటికి చేరేవరకు బాధ్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ నెల 19,20,21 తేదీలు కీలకం అనీ అధికారులంతా ప్రణాళికాబద్ధంగా, కలసికట్టుగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంత్రి నారా లోకేష్ అధికార యంత్రాంగాన్ని కోరారు.  ఏదేమైనా ఒకేసారి 5 లక్షల మందితో యోగాసనాలు వేయిస్తూ  గిన్నిస్ రికార్డు  నెలకొల్పాలని ఏపీ ప్రభుత్వం  తీవ్రంగా శ్రమిస్తోంది.