తలలు తెగినా సరే విశాఖను రాజధానిగా చేసుకుంటామ‌న్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదనిక ప్రశ్నించారు.  వంశధార ప్రాజెక్టుకు చంద్రబాబు చేసిందేమిటిని అడిగారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి చంద్రబాబు ఒక్క ఇటుకైనా అని నిల‌దీశారు. మా ప్రాంత అభివృద్ధికి ఎవరు అడ్డం వచ్చినా సహించబోమని తొక్కుకుంటూ పోతామన్నారు. 15న జరిగే విశాఖ గర్జన ప్రత్యర్థుల గుండెల్లో గునపమని అభిప్రాయపడ్డారు.  


తాడేప‌ల్లిలో మీడియాతో మాట్లాడిన సీదిరి అప్పలరాజు... "ఈ మూడేళ్ల కాలంలో జగన్‌ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్‌ అయినా పూర్తి చేసిందా" అంటూ ఓ పత్రిక వార్త రాసిందని... 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబును ఎందుకు అలా అడగలేదు. వంశధార ప్రాజెక్ట్‌ కోసం చంద్రబాబు చేసిందేంటని ప్రశ్నిస్తున్నా? ఆ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని చంద్రబాబుకు ఆలోచన ఉందా? వైఎస్సార్‌ హయాంలో ఫేజ్‌-2కి అనుమతి ఇచ్చారు. ఆయన హయాంలోనే హిరమండలం రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకురావాలనే సంకల్పించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు. కనీసంగా ఆలోచన అనేది కూడా చేయలేకపోయారు" అని విమర్శించారు. 


మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన వంశధార ఫేజ్‌-2 పనులు పూర్తి చేసే దశకు చేరుకున్నామన్నారు అప్పలరాజు. దీని కోసం ఒడిశా సర్కార్‌తోనూ సంప్రదింపులు జరిపామని తెలిపారు. నేరడి బ్యారేజ్‌ కట్టడానికి ముందుగానే హిరమండలం రిజర్వాయర్‌ పూర్తి స్థాయిలో నింపేందుకు గొట్టా బ్యారేజ్‌ దగ్గర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి ప్రపోజ్‌ చేసినట్టు వివరించారు. దాని కోసం జీవో ఇచ్చామన్నారు. వంశధార ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. 


ఉద్దానంలో వేల మంది కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నారని, వారికి ఒక రీసెర్చ్‌ ఆస్పత్రి కట్టాలని చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించారా? అని అన్నారు మంత్రి. జగన్‌ మోహన్‌ రెడ్డి పుణ్యమా అని కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రికి సంబంధించి 70శాతం పనులు పూర్తి చేసుకోగలిగామని వివరించారు. రూ. 700 కోట్లుతో ఉద్దానానికి మంచినీటి ప్రాజెక్ట్‌ నిర్మాణం పనులు 70శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. శుద్ధి చేసిన మంచినీళ్లను ఒక్క చుక్కనీరు అయినా బాబు హయాంలో ఇప్పించగలిగారా? అని ప్రశ్నించారు. 


ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు విషయానికొస్తే రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించిన ఆ ప్రాజెక్ట్‌కు చంద్రబాబు ఒక్క ఇటుక అయినా ఎందుకు వేయలేకపోయారని ప్రశ్నించారు మంత్రి అప్పలరాజు. ఇటుక కాదు కదా ఇంచి భూమిని కూడా సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ కోసం చంద్రబాబు సేకరించగలిగారా? అని నిలదీశారు. ఉత్తరాంధ్ర పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఒక్కమాటలో చెప్పగలరా? అని అడిగారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ల్యాండ్‌ ఎక్విజేషన్‌ ప్రక్రియ ప్రారంభించిందని.. పోలవరం ప్రాజెక్ట్‌ నీటిని విజయనగరం వరకూ తీసుకువెళ్లగలమనే యోచన చంద్రబాబు ఎందుకు చేయలేదన్నారు. 


యూనివర్శిటీ లేని జిల్లా పాత విజయనగరం జిల్లా అని... సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు గురజాడ యూనివర్శిటీ పెడుతున్నామంటూ చంద్రబాబు ఒక ఉత్తుత్తి జీవో ఇచ్చారన్నారు. వర్శిటీ పెట్టాలంటే జీవోలతో సరిపోదని... ప్రత్యేకమైన చట్టం చేయాలన్నారు. అదే గురజాడ యూనివర్శిటీకి ప్రత్యేక చట్టం చేసి వర్శిటీని నెలకొల్పిన ఘనత జగన్‌ మోహన్‌ రెడ్డిదేనన్నారు.  విభజన వల్ల జరిగిన గాయానికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్థలను కూడా చంద్రబాబు ఖాతాలోనే వేశారని.... ఆయనే ఆ వర్శిటీలను తెప్పించినట్లు రాశారన్నారు. చంద్రబాబు సీఎం కాకున్నా, ఎవరు సీఎంగా ఉన్నా ఆ సంస్థలు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తీరుతాయని వెల్లడించారు.  


గతంలో ఉన్న ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, కింగ్‌ జార్జ్‌ హాస్పటల్‌... ఇవన్నీ చంద్రబాబు పెట్టినవి కాదనేది గుర్తించాలన్నారు అప్పల రాజు. శ్రీకాకుళంలో రిమ్స్‌ కాలేజీ కూడా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి  హయాంలోనే వచ్చిందన్నారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలో ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా పెట్టారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ గారు అధికారంలోకి వచ్చాక విజయనగరం, అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, పాడేరులో మెడికల్‌ కాలేజీలు పెడుతున్నామన్నారు. వీటన్నింటిని టీచింగ్‌ హాస్పటల్స్‌గా మార్పు చేసుకుంటున్నామని వివరించారు. సీతంపేట, పార్వతీపురంలో సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి కడుతున్నామని తెలిపారు.  


చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రకు తీసుకువచ్చిన ప్రాజెక్ట్‌ ఏదైనా ఉందని గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా అని నిలదీశారు. శ్రీకాకుళంలో అంబేడ్కర్‌ యూనివర్శిటీ, రిమ్స్‌ మెడికల్‌ కాలేజీ, విశాఖలో విమ్స్‌ వైఎస్సార్ హయాంలోనివేనన్నారు. టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీసుకువచ్చిన ప్రాజెక్ట్‌లు ఏంటని నిలదీశారు. భావనపాడు పోర్టు కట్టడానికి జగన్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని వివరించారు. ఓ పక్క ఉత్తరాంధ్ర వెనుకబడిపోతోందని మాట్లాడుతూ... మరోవైపు ఈ రాజకీయాలు ఏంటని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లు తీసుకువస్తే మోకాలడ్డు వేస్తున్నారని ఆరోపించారు. 


చంద్రబాబు వెనుక ఉండి నడిపిస్తున్న అమరావతి రైతుల పాదయాత్ర.. అదొక కృత్రిమ ఉద్యమమన్నారు. యాత్రలో పాల్గొంటే వెయ్యి నుంచి రెండువేలు వరకూ చెల్లిస్తున్నారని ఆరోపించారు. పెయిడ్‌ వర్కర్స్‌ను తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ఇస్టానుసారంగా తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న వికేంద్రీకరణ విధానంతో తమ ప్రాంతానికి స్వేచ్ఛ వస్తుందని అభిప్రాయపడ్డారు. బలమైన రాజకీయ నిర్ణయంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే.. చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. మా ఆకాంక్షలను అవహేళన చేస్తే తొక్కుకుంటూ పోతాం తప్ప, వెనక్కి అడుగేసే ప్రసక్తే లేదన్నారు. తలలు తెగినా సరే, విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుంటామన్నారు. తమ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న చంద్రబాబు ఉత్తరాంధ్రలో ఎలా అడుగు పెడతారో చూస్తామన్నారు అప్పలరాజు.