AP Minister Adimulapu Suresh Comments on Teachers:
గురువులను చులకన చేస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. గురువులు కన్నా గూగుల్ మేలు అని తాను అనలేదని, కానీ తాను అన్నట్లు వచ్చిన వార్తలను మంత్రి ఖండించారు.
ఉపాధ్యాయులు దినోత్సవం వేదికగా...
ఒంగోలులో ఉపాధ్యాయ దినోత్సవ సభలో తాను మాట్లాడింది ఒకటైతే కొన్ని మీడియా సంస్థలు దానిని వక్రీకరించాయని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. దీని ద్వారా ఉపాధ్యాయ లోకానికి తప్పుడు సంకేతాలు పంపి తనపై వ్యక్తి గత దాడికి దిగే ప్రయత్నం చేశారని అన్నారు. తాను కూడా ఉపాధ్యాయునిగా ఉండాలని గర్వపడతానని అదే సభలో మాట్లాడాను అని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఇంటర్నెట్ సౌలభ్యంతో సమాచారం అంతా దొరుకుతున్న ఈరోజుల్లో ప్రతిఒక్కరు నిత్యం విద్యార్దులే అని చెబుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సంసిద్దులు కావాలనే ఉద్దేశంతో మాట్లాడానన్నారు.
టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని...
టెక్నాలజీ పెరిగిపోయి యాప్ లు, ట్యాబ్ లు వచ్చాయని మారిన కాలానికి అనువుగా అందరూ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. గూగుల్ లో సమాచారాన్ని వెతుకుతూ గూగుల్ తల్లిని అడిగి తెలుసుకున్నానని సమాజంలో కొందరు వ్యంగ్యంగా మాట్లాడే విషయాన్ని ప్రస్తావించానన్నారు. గూగుల్ ను సృష్టించింది కూడా గురువులే కదా అని ఆయన ప్రశ్నించారు. తాను గురువులను కించపరిచేలా మాట్లాడలేదని, తన తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులని.. టీచర్ల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిని అని చెప్పారు.
గతంలో విద్యాశాఖ మంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన విద్యా సంస్కరణల్లో తన కృషి, ఉపాధ్యాయ సంఘాలతో నాకున్న సత్సంబంధాలు అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వం పైన, ముఖ్యంగా తనపైన వ్యక్తిగతంగా బురదజల్లే కార్యక్రమం ఎల్లో మీడియా చేపట్టిందని దీనిని నమ్మవద్దని ఉపాధ్యాయులను కోరారు. తప్పుడు సమాచారం ఇస్తూ వారికి అనుకూల పార్టీకి అనుకూలంగా కధనాలు ఇస్తూ రాజకీయం చేయటం జర్నలిజం అనిపించుకోదు అని హితవు పలికారు. ఇలాంటి వివాదాలు లేపి ఎవరికి లబ్ది చేకూర్చాలని చూస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. అనని మాటలను వక్రీకరించి వారికి అనువుగా పత్రికల్లో ప్రచురించుకునే సంస్కృతి మంచిది కాదని మంత్రి సురేష్ హితవు పలికారు.
ఇంతకీ మంత్రి ఏమన్నారంటే..
‘బైజూస్‌తో టెక్నాలజీ అంతా ట్యాబ్ లలో వచ్చింది. ఓ పేరడి లాగ గురువులు అవసరం లేదు. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చింది. గురువులకి తెలియని విషయాలు గూగుల్‌లో కొడితే మనకు తెలిసిపోతున్నాయి. సాంకేతికత మనకు అందుబాటులోకి వచ్చింది. మనం దాన్ని స్వీకరించడానికి అందుబాటులో ఉన్నామా లేదా’ అంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీచర్ యూనియన్స్ ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి ఆదిమూలపు దిగొచ్చి తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, వారిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు.
Also Read: Andhra University: ఏయూ వీసీని తక్షణమే రీకాల్ చేయాలి - రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్