Nara lokesh On Notices: యువగళం పాదయాత్రపై దాడి జరిగితే పోలీసులు అధికార వైసీపీ నేతలకే మద్దతు తెలుపుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. భీమవరం నియోజకవర్గంలో తనపై, టీడీపీ శ్రేణులపై దాడి జరిగితే.. నోటీసులు తనకు ఎందుకు ఇస్తున్నారని, తానేం చేశానో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంపలో లోకేష్ మాట్లాడుతూ.. ఏపీని దక్షిణ బిహార్ గా మార్చేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
భీమవరంలో తన పాదయాత్రలో వైసీపీ విధ్వంసం సృష్టించిందన్నారు. తనపై, టీడీపీ శ్రేణులపై వైపీపీ వర్గీయులు రాళ్లు, సీసాలతో దాడి చేశారని నారా లోకేష్ ఆరోపించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణరాజు తన సొంత నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎంపీ అయినప్పటికీ ఇదివరకే అరెస్ట్ చేసి వేధించారని గుర్తుచేశారు ఇప్పుడు యువగళంలో తనకు రక్షణగా నిలిచిన వాలంటీర్లను పోలీసులు తీసుకెళ్లడం సరికాదన్నారు. అసలు తాను ఏం చేశానని, ఏం అన్నానని నోటీసులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీలో చట్టాలు వైసీపీ నేతలకు అనుకులంగా మారాయన్నారు.
భీమవరంలో లోకేష్ యువగళం పాదయాత్రపై దాడిచేసి హింసకు దిగాలని వైసీపీ శ్రేణులు ముందే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యువగళం పాదయాత్ర అబ్జర్వర్ రెండు రోజుల ముందే చెప్పారని, అయినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.
యువగళం వాలంటీర్లు అలర్ట్..
లోకేష్ పాదయాత్ర క్యాంప్ సైట్ పై పోలీసులు అర్థరాత్రి దాడి చేసి యువగళం వాలంటీర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మూడు వాహనాలలో వచ్చి యువగళం వాలంటీర్లతో పాటు కిచెన్ సిబ్బంది సహా సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరెస్ట్ చేసిన తరువాత యువగళం వాలంటీర్లను భీమవరం, నర్సాపురం, వీరవాసరం కాళ్ల పోలీస్‌స్టేషన్లకు తిప్పారు. చివరగా సిసిలిలోని వైఎస్ఆర్‌సీపీ నేతకు చెందిన మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్యాక్టరీలో వీరిని ఉంచినట్లు ప్రచారం జరగడంతో.. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అదుపులోకి తీసుకున్న యువగళం వాలంటీర్లపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసేందుకు యత్నిస్తున్నారని టీడీపీ నేతలు పోలీసులపై ఆరోపణలు చేశారు. యువగళం పాదయాత్రకి అనుమతి ఇచ్చి అదే రూట్‌లో వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలు.. రాళ్ల దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో రాజకీయ గొడవలు పెద్దగా జరగవు. కానీ అలాంటి చోట సైతం లోకేష్ పాదయాత్రను టార్గెట్ గా చేసుకుని వైసీపీ శ్రేణులు దాడి చేయగా.. యువగళం వాలంటీర్లు ఎదురుదాడికి దిగాల్సి వచ్చింది. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు కలిగించాలని వైసీపీ కుట్ర చేస్తోందని, దాని ప్రకారం రాష్ట్రంలో పోలీసులు నడుచుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
మంగళవారం రాత్రి యువగళంలో ఉద్రిక్తత..
భీమవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గునుపూడి రాకముందే... కొందరు అల్లరి మూక యువగళం పాదయాత్రపై రాళ్లదాడికి పాల్పడింది. గునుపూడి వంతెన వద్ద వైసీపీ జెండాలు ఊపి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాదయాత్ర ఇందిరమ్మ కాలనీకి చేరుకోగానే వైసీపీ వర్గానికి చెందిన కొందరు జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. టిడిపి వర్గీయులు జై లోకేష్ అంటూ నినాదాలు చేయడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. అనంతరం జరిగిన రాళ్ల దాడిలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి.