Sajjala Ramakrishna Reddy About Arrest Of Chandrababu:


ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చేమో అంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సమాధానం చెప్పకుండా బుకాయిస్తూ కాలక్షేపం చేయటం చంద్రబాబుకు అలవాటేనని ఆయన మండిపడ్డారు.


చంద్రబాబు కామెంట్స్ పై సజ్జల రియాక్షన్...
తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ పై ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సజ్జల రామ కృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వ్యవస్దలను అడ్డం పెట్టుకొని కాలక్షేపం చేసి వాస్తవాలను పక్క దారి పట్టించటంలో కీలక భూమిక పోషిస్తారని ఈ విషయాలు ప్రజలందరికి తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు. 118 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కు సంబంధించిన వ్యవహరంపై చంద్రబాబు సమాధానం చెప్పకుండా, ఇప్పుడు కొత్త డ్రామాలకు తెర తీస్తున్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారేమో అంటూ సానుభూతి కోసం ప్రయత్నాలు ప్రారంభించారని అన్నారు. కేంద్ర పరిధిలోని దర్యాప్తు సంస్థలు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి సమాధానం చెప్పమంటే, వైసీపీ ప్రభుత్వం పై నిందలు వేయటం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్దలు చంద్రబాబు అవినీతిపై విచారణ చేసి, అరెస్ట్ చేస్తే చేయవచ్చని సజ్జల అన్నారు.


అవినీతి సొమ్ము ఎక్కడ ఉందో చెప్పాలి...
చంద్రబాబుపై భారీ స్దాయిలో అవినీతి ఆరోపణలు వచ్చిన క్రమంలో ఆ సొమ్మును ఎక్కడకు తరలించారనే విషయంలో ఎందుకు సమాధానం చెప్పటం లేదని సజ్జల రామ కృష్ణారెడ్డి ప్రశ్నించారు. కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవటం అలవాటు పడిన చంద్రబాబుకు అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చి, తన నిజాయితీని నిలబెట్టుకునే అలవాటు లేదా అని ప్రశ్నించారు. ప్రతి ఏటా ఆస్తుల చిట్టాను ప్రకటించే చంద్రబాబు అందులో ఈ వివరాలను కూడ ఎందుకు చూపించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై వివరణ కూడా ఇవ్వలేని స్దితిలో ఉన్న చంద్రబాబు, ఎదరుదాడి చేసి డైవర్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.


లోకేష్ పాదయాత్రలో రెచ్చకొడుతున్నారు...
యువగళం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ప్రజలను రెచ్చకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల రామ కృష్ణారెడ్డి అన్నారు. పుంగనూరులో జరిగిన దాడి, తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్లాన్ చేసి మరి దాడులకు పాల్పడుతున్నారని సజ్జల మండిపడ్డారు. పోలీసులను సైతం గాయపరచి వాళ్ళ రక్తం కళ్ళ చూసే శాడిజం తెలుగు దేశం నేతల్లో కనిపిస్తోందని అన్నారు. నిబంధనలకు లోబడి చేయాల్సిన పాదయాత్రలో ఇష్టాను సారంగా వ్యవహరించి స్దానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, శాంతి భద్రతలకు విఘూతం కలిగిస్తున్నారని ఆయన అన్నారు. పాదయాత్రకు ఇచ్చిన రోడ్ మ్యాప్ కాకుండా వేరొక మార్గాల్లో పాదయాత్ర పేరుతో వెళ్ళటం సరికాదని అన్నారు. పోలీసులు భద్రత కల్పించి, సహకరిస్తుంటే, వారిపై దాడులకు పాల్పడటం, ఎంటని సజ్జల ప్రశ్నించారు. జగన్ పాదయాత్రకు తెలుగుదేశం నేతలు నిర్వహించిన పాదయాత్రలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.