Amaravati Lands Case : ఆర్-5 జోన్ కు భూ బదలాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.విచారణలో భాగంగా భూ బదలాయింపు చేసే అధికారం సీఆర్డీఏకు లేదని పిటిషనర్ తెలిపారు.
ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కోర్టు ఇళ్ల పట్టాలు మాత్రమే ఇవ్వాలని చెప్పిందన్న న్యాయమూర్తి ఇళ్ల నిర్మాణం చేపట్టమనలేదు కదా అని ప్రశ్నించింది. అనంతరం ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీకి వ్యక్తిగత నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకూ ఇళ్ల నిర్మాణంపై ఎలాంటి ముందడుగు వేసే అవకాశం లేదు.
అమరావతి ఆర్-5 జోన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం యాజమాన్య హక్కులు లేని పత్రాలను పంపిణీ చేశారు. కోర్టు కేసులు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తేనే ఆ పట్టాలు చెల్లుతాయి. లేదంటే చెల్లవు. ఇప్పుడు యాజమాన్య హక్కులు లేని పట్టాలను ఇవ్వడం వల్ల పేదలకు కూడా పెద్దగా మేలు జరగదని విపక్షాలు అంటున్నాయి. పేదలకు ఇచ్చే స్థలాల్లో లక్షలు పోగు చేసుకుని అక్కడ వారు ఇళ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఇళ్లు కట్టుకున్న తర్వాత కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వారి సొమ్ము మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుందని.. పట్టాల పంపిణీకి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని ఇళ్ల నిర్మాణానికి కాదని రైతులు వాదిస్తున్నారు.
ఇళ్ల స్థలాల పేరుతో ఒక్క సెంటు భూమి కేటాయింపుల కోసం ఆర్ 5 జోన్ ఏర్పాటు కోసం రాజధాని ప్రణాళికలో మార్పులు చేయటం వెనుక దురుద్దేశం ఉందని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా జగనన్న ఇళ్ల పేరుతో జరుగుతున్న పనులను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వ్యాజ్యంలో ప్రతివాదులుగా సీఎం జగన్.. పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిని వ్యక్తిగత హోదాలో పేర్కొన్నారు. వారితో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. హౌసింగ్ మంత్రిత్వ శాఖను ప్రతివాదులుగా చేర్చారు. అటు జూలై 8న ఇంటి నిర్మాణాల శంకుస్థాపకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అయితే ఇప్పుడు హైకోర్టు విచారణతో.. ఎనిమిదో తేదీన ఇళ్లకు శంకుస్థాపన లేనట్లుగానే భావిస్తున్నారు.
రో వైపు ఆర్ -5 జోన్ పైన ఉద్యమం చేస్తామని ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రకటించారు. ఉద్యమం మొదటి దశలొ బాగంగా జూలై 17 నుంచి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ నుంచి అమరావతిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన స్థలం వరకు పాదయాత్ర..బహిరంగ సభకు నిర్ణయించారు. రెండో దశలో తాడికొండ, మంగళగిరి తో పాటుగా రాజధాని పరిసర ప్రాంత నియోజకవర్గాల్లో గడప గడపకు అమరావతి నిర్వహిస్తామని ప్రకటించారు. మూడో దశలో జగన్ ఓటమే లక్ష్యంగా 175 నియోజకవర్గాల్లో అమరావతి రథయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దం అవ్వటం సరికాదన్నారు.