Andhra Pradesh Toll Tax News: అభివృద్ధి సంస్కరణలు ఎప్పుడూ ప్రభుత్వానికి కత్తి మీద సాములానే ఉంటాయి. ఒక్కోసారి ప్రజల్లో మంచి పేరు తెచ్చి పెడితే మరోసారి అదే తీవ్ర వ్యతిరేకతను రగులుస్తుంది. ఇప్పుడు ఏపీలోని కూటమి ప్రభుత్వం అలాంటి ప్రయోగాన్ని చేపడుతోంది. అదే జిల్లా రోడ్లకు సైతం టోల్ టాక్స్ వర్తింపజేయాలనే ఆలోచన. ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 18 రోడ్లను ఎంపిక చేసి టోల్ టాక్స్ ఆచరణలో పెట్టబోతుంది. 

అసెంబ్లీలో ప్రకటించిన సీయం చంద్రబాబు
ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నేషనల్ హైవేలకు పిలిచినట్లుగానే ఏపీలోని జిల్లా రోడ్లకు సైతం టెండర్లు పిలిచి అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు. ఈ పనిని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలుగా అప్పజెప్పాలి అనేది ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న కొంత మొత్తం (900కోట్లు) తో రాష్ట్రంలోని రోడ్లకు ఉన్న గుంతలు పూడ్చే పనిలో ఉన్నామని వివరించారు. వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే ఔట్‌ సోర్ింగ్‌ ఏజెన్సీలకు అప్పజెప్పడమే మంచి ఆలోచన అన్నట్టుగా చెప్పరాయన. 

అయితే ఈ ఆలోచన ఆచరణలోకి రావాలంటే రాష్ట్రంలోని రోడ్లకు కూడా హైవేలుకు ఉన్నట్టే టోల్ టాక్స్ వసూలు చేయాల్సి ఉంటుంది అని సమాచారం. గ్రామాలు మండలాలు మినహాయించి పట్టణాలను కలిపే రాష్ట్ర స్థాయి రోడ్లకు టోల్ టాక్స్‌లు విధిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ టోల్ టాక్స్ నుంచి బైకులు, ట్రాక్టర్లు, చిన్న చిన్న ట్రక్కులు, ఆటోలను మినహాయించనున్నట్టు సమాచారం. 

గోదావరి జిల్లాల నుంచే ప్రారంభం 
రాష్ట్రవ్యాప్తంగా 18 ఆర్‌ అండ్‌ బీ రహదార్లును గుర్తించినప్పటికీ ముందుగా ఈ ప్రయోగాన్ని గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇలా జిల్లా స్థాయి రోడ్ల నుంచి టోల్ టాక్స్ వసూలు చేయడం వల్ల పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్‌లో రోడ్లు అభివృద్ధి చేయడం ఈజీ అవుతుంది. కానీ ఇందులో మరో సమస్య ఉందనేది ప్రజా సంఘాల వాదన. ఇప్పటికే రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెరిగి పోయాయి. అదికాక ఆల్రెడీ హైవేలుకు టాక్స్‌లు కడుతున్నారు ప్రజలు. ఇప్పుడు రాష్ట్రంలో రోడ్లకు కూడా టాక్స్‌లు విధిస్తే అది బూమ్‌రాంగ్ అయ్యే ప్రమాదం లేక పోలేదు. 

గతంలో విద్యుత్ ఛార్జీల సంస్కరణల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అబిడ్స్ కాల్పుల ఘటన ఇప్పటికీ చంద్రబాబు పాలనకు ఒక మచ్చలా ఉండిపోయింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రస్థాయిలో రోడ్లకు టోల్ టాక్స్‌లు అంటే దాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో అనేది అధికార పార్టీలోనే చర్చను లేవనెత్తుతోంది. అందుకనే ఏపీ ప్రభుత్వం హడావుడిగా ఈ ఆలోచనను ఆచరణలోనికి తెచ్చేయకుండా ముందుగా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యేలను సూచించింది. మరి ప్రభుత్వ ఆలోచన ఆచరణలో సాఫీగా సాగుతుందా లేదా తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

పీపీపీ ద్వారా అభివృద్ధి చేసే రహదారులు ఇవే 

తొలి విడత 18 రోడ్లను ప్రభుత్వం ఎంపి చేసింది. దీన్ని తర్వాత 68 రోడ్లకు విస్తరిస్తారు. మొదటి విడతలో 1,307 కి.మీ. రోడ్లు పీపీపీ ద్వారా బాగు చేస్తే...  రెండో విడతలోని 3,931 కి.మీ.లు త్రిబుల్ పీ విధానంలో రూపురేఖలు మారుస్తారు. 

  అభివృద్ధి చేయనున్న రోడ్డు  రోడ్డు పొడవు కిలోమీటర్లులో ..
1 చిలకపాలెం- రామభద్రపురం- రాయగడ  130.40 
2 విజయనగరం పాలకొండ     72.55
3 కళింగపట్నం - శ్రీకాకుళం- పార్వతీపురం  113.40
4 భీమునిపట్నం- నర్శీపట్నం  78.10
5 కాకినాడ - జొన్నాడ  48.84
6 కాకినాడ- రాజమండ్రి కెనాల్  65.20
7 ఏలూరు- మేడిశెట్టి వారి పాలెం  70.93
8 నరసాపురం - అశ్వారావుపేట  100.55
9 ఏలూరు- జంగారెడ్డి గూడెం  51.24
10 మంగళగిరి తెనాలి- నారాకోడూరు  40.05
11 బెస్తవారిపేట- ఒంగోలు  113.25
12 రాజంపేట - గూడూరు    95
13 ప్యాపిలి- బనగానపల్లి    54.44
14 దామాజీపల్లి- నాయినపల్లిక్రాస్‌- తాడిపత్రి  99.19
15 జమ్మలమడుగు- కొలిమిగుండ్ల  43
16 సోమందేపల్లి-హిందూపురం- తూముకుంట  35.53
17 గుంటూరు - పర్చూరు 41.44
18 గుంటూరు- బాపట్ల 51.24

Also Read: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!