ఆక్వా రైతుల సమస్యలపై ఏర్పాటయిన ఎంపవరింగ్ కమిటీ తొలిసారి భేటీ అయ్యింది. ఆక్వా దాణా రేట్ల పెరుగుదల, ఆక్వా ఉత్పత్తుల విక్రయ ధరలు, దాణా రేట్లపై నియంత్రణ వ్యవస్థ, ఆక్వా రైతుల్లో వ్యక్తం అవుతున్న ఆందోళపై చర్చించారు. కమిషన్ ఏజెంట్ల చేతుల్లో ఆక్వా రైతులు నష్టపోకుండా, రైతులు, దాణా, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో ఆక్వా రంగానికి ఉన్న అవకాశాలు, ప్రోత్సహించేందుకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని కమిటిలో మంత్రి పెద్ది రెడ్డి వెల్లడించారు. ఆక్వారంగంలో సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని, ఆక్వా రైతులు సంక్షోభంలో చిక్కుకుంటే దాని అనుబంధ పరిశ్రమలు కూడా ఇబ్బంది పడతాయని అభిప్రాయపడ్డారు. అందుకే రాష్ట్రంలో ఆక్వా రైతుల పరిస్థితి పై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఆక్వా రైతులకు భారంగా మారిన దాణారేట్లను నియంత్రించడం, ఆక్వా ఉత్పత్తులకు సరైన రేటు దక్కేలా చేయడం కోసం మంత్రులు, అధికారులతో సీఎం జగన్ ఏర్పాటు చేసిన ఎంపవరింగ్ కమిటీ భేటీ అయినట్టు వివరించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాంప్ కార్యాలయంలో కమిటీ సమావేశమైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, కారుమూరు నాగేశ్వరరావు, రాష్ట్రప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీతోపాటు మార్కెటింగ్ అవకాశాలు కూడా మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఆక్వా రంగానికి ఫీడ్, సీడ్ అందించే పరిశ్రమలకు కూడా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందని తెలిపారు. అపారమైన అవకాశాలు ఉన్న ఆక్వారంగంలో ఆరోగ్యకమైన మార్పులు రావాలని ప్రభుత్వం కోరుకుంటోందని సూచించారు.
గత మూడున్నర సంవత్సరాల్లో ఆరు సార్లు ఆక్వా దాణారేట్లు పెంచడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని ప్రస్తావించారు. దాణా రేట్ల విషయంలో నియంత్రణలు లేని పరిస్థితిని కొందరు తయారీదారులు అనుకూలంగా మలుచుకోవడం వల్ల తీవ్ర ప్రభావం పడుతోందని వివరించారు. దాణారేట్లు పెరగడం, ఆక్వా ఉత్పత్తుల రేట్లు తగ్గడం వల్ల ప్రతికూల పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. దీనిపై సీఎం సమీక్షించి రైతులకు నష్టం లేకుండా, దాణారేట్ల పెరుగుదలను నియంత్రిస్తూ, ఆక్వా ఉత్పత్తులకు సరైన ధర అందించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఆక్వా రంగానికి దాణాను అందిస్తున్న కంపెనీలు, ఆక్వా రైతులతో అధికారులు సమావేశాలు నిర్వహించాలని, దాణా రేట్ల పెరుగుదల సహేతుకంగా జరిగిందా, లేదా అనే విషయాలను అధ్యయనం చేయాలని మంత్రులు సూచించారు. అంతర్జాతీయ ఆక్వా రేట్లకు అనుగుణంగా, దేశీయ పరిస్థితులను పరిశీలించి ఆక్వా ఉత్పత్తుల సరైన రేటు రైతులకు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతు నుంచి నేరుగా ఆక్వా ప్రోసెసింగ్ సంస్థలకు విక్రయాలు జరగకుండా మధ్య దళారులు, కమీషన్ వ్యాపారులు రేట్లను నియంత్రిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయని, వారి వల్ల రైతుకు అందాల్సిన ధర దక్కడం లేదని అన్నారు. దీనిపైన కూడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా దాణాకు అవసరమైన ముడి పదార్థాల రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు, దానికి అనుగుణంగా దాణా రేట్లు పెరుగుతున్నాయా, లేక అధికంగా రేట్లను పెంచుతున్నారా అనే అంశాలను అధ్యయనం చేయాలని కోరారు. ఆక్వా రైతులు సంతోషంగా ఉంటేనే, దానికి అనుబంధంగా ఉన్న దాణా ఉత్పత్తిదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు బాగుంటాయని, ఈ విషయంలో పరస్పర అంగీకారంతో దాణారేట్లను, ఆక్వా కొనుగోలు ధరలను నిర్ణయించే ప్రక్రియ ఉండాలన్నారు