ఏపీలో వికేంద్రీకరణ రచ్చ రోజురోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గేలా కనిపించడం లేదు. ముఖ్యంగా విశాఖపట్నంను పరిపాలనా రాజధాని (vizag as executive capital)గా చేయాలని అధికార వైసీపీ నేతలు, మంత్రులు ప్రజాగర్జను సిద్ధమయ్యారు. అయితే ఏపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపుతూ, ఎందుకు వైసీపీ గర్జన అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు పవన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పై ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. దేశ చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి చెప్పుదెబ్బ లాంటి తీర్పును గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చారని, అయినా సిగ్గు లేకుండా బయటకు వచ్చి ప్రవచనాలు చెబుతున్నారంటూ దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. 


డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఫైర్ 
ప్రజాగర్జనను డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని విమర్శించారు. సోషల్ మీడియా ఉంది కనుక మీ చరిత్ర తెలిసిపోతుంది, మీ గుడ్డలు విప్పదీసి నిలబెడుతున్నా మీలో మార్పు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అతని దుష్ట చతుష్టయానికి ఎప్పటికీ బుద్ధి రాదన్నారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, వారిలో ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు తాను మద్దతు ఇవ్వనని సవాల్ విసిరారు.


పవన్ కి ఎంత అహంభావం? 
దుష్టచతుష్టయం తమ ప్రణాళికలో భాగంగా ఏపీలో రథయాత్రలు పాదయాత్రలు చేస్తున్నారని చెప్పారు. పవన్ కి ఎంత అహంభావం? ఐదు కోట్ల మంది వారి భావన తెలియపరచుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. కేవలం తన స్వ ప్రయోజనాల కోసం ప్యాకేజీ తీసుకుని పవన్ ఒక్కడు మాత్రమే బాగుంటే సరిపోతుందా, ప్రజలు నీ డైవర్షన్ పాలిటిక్స్ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికార వైసీపీ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తూ బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.


మూడు ప్రాంతాల ప్రజలకు వీకేంద్రీకరణ కావాలని, తద్వారా రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని వైజాగ్‌లో ఈ నెల 15వ తేదీన గర్జన నిర్వహిస్తున్నారని మంత్రి చెప్పారు. ప్రజాగర్జనకు ప్రజల మద్దతు ఉందని, ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయన్నారు. వైసీపీ ప్రజాగర్జన సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో జనవాణీ కార్యక్రమం చేయాలని నిర్ణయించారు. మరోవైపు అమరావతి రైతు మహా పాదయాత్ర త్వరలో ఉత్తరాంధ్రలో ప్రవేశించనుండటంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 


Vizag JAC :   విశాఖ గర్జనకు ఉత్తరాంధ్ర  ప్రజలంతా మద్దతివ్వాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ , మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న  విశాఖ గర్జన సభకు సంబంధించిన పోస్టర్‌ను వీరుఆవిష్కరించారు.  వికేంద్రికరణకు మద్దతుగా  ప్రభుత్వం  ముoదుకు వెళుతున్న సమయంలో  కొంతమంది సమస్యలు సృష్టిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు . మూడు రాజదానులకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు .  ఉత్తరాంద్ర ప్రాంత అబివృద్ది చెందాలంటే మూడు రాజధానులు అవసరమని ఆయన స్ఫష్టం చేశారు. ఉత్తరాంధ్ర అబివృద్ధి చెందకూడదనే హక్కు ఎవరికి లేదని ఆయన స్పష్టం చేశారు.