AP Govt Discussions with AP Employee Unions: ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు ముగిశాయి. ఈ సమావేశంలో పీఆర్సీ బకాయిలు, డీఏల విడుదల, మధ్యంతర భృతి, ఐఆర్‌, పెండింగ్‌ డీఏ, సరెండర్‌ లీవ్‌లు, పదవీ విమరణ బకాయిలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వం తరపున మంత్రి బొత్స సత్యనారాయణ ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొనగా.. మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రూ.5,600 కోట్ల బకాయిల విడుదలపై చర్చించామని చెప్పారు. త్వరగా ఉద్యోగుల పెండింగ్‌ అంశాలను పరిష్కరించాలని సీఎస్‌, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించామని వివరించారు. 


మరోవైపు, విశాఖ ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అంతేకాక, ఆయన ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పటికే ప్రకటించామని మంత్రి బొత్స చెప్పారు.


ఇటీవల ఏపీజేఏసీ వార్నింగ్
ఏపీ జేఏసీ ఇటీవల ఛలో విజయవాడకు పిలుపు ఇచ్చింది. నాలుగున్నరేళ్లుగా తమ సమస్యలను జగన్ సర్కారు గాలికి వదిలేసిందని.. అందుకని తాము ఆందోళనలకు రెడీ అవుతున్నట్లుగా రెండు రోజుల క్రితం ఏపీజేఏసీ ప్రెసిడెంట్ బండి శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే ఫిబ్రవరి 27న ‘చలో విజయవాడ’ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే సమ్మెకు కూడా చేస్తామని చెప్పారు. ఉద్యోగులు దాచుకున్న వివిధ రకాల డబ్బుతో పాటు పీఆర్సీ, పెండింగ్ లోని డీఏ, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ లీవ్స్ కు చెందిన ఎంతో సొమ్ము తమకు రావాల్సి ఉందని ఏపీజేఏసీ నేతలు చెబుతున్నారు. వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం గడువు పెట్టి కూడా.. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు తాము నిర్వహించ నిర్వహించ తలపెట్టిన ఉద్యమ శంఖారావం పోస్టర్లను కూడా ఏపీ జేఏసీ విడుదల చేసింది.