AP CM YS Jagan Review Meeting Today At Camp Office:
- గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టండి
- పట్టణాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై ఫోకస్ చేయాలి
- చేయూత కింద స్వయం ఉపాధిని ప్రోత్సహించాలన్న సీఎం జగన్
- పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖపై ఏపీ సీఎం సమీక్ష
గ్రామాల్లో సమగ్ర సర్వేపై ఫోకస్, పట్టణాల్లో డిజిటల్ లైబ్రరీలు: సీఎం జగన్
గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలని, అర్బన్ ప్రాంతాల్లో డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇకనుంచి గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలన్నారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై ఫోకస్ చేయాలని చెప్పారు. ఈ మేరకు ఈ శాఖల ఉన్నతాధికారులను పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ లైబ్రరీలు (Digital Libraries In Andhra Pradesh) సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు.
ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం
చేయూత కింద స్వయం ఉపాధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం జగన్ సూచించారు. లబ్ధిదారులు తొలివిడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం (YSR Sunna Vaddi Scheme) నిర్వహించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలన్నారు. వాటి పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రేపు విశాఖకు సీఎం వైఎస్ జగన్
- విశాఖలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు
ఆగస్టు 1న ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్. అనంతరం కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం హై–టీలో ఆయన పాల్గొంటారు. అదే ప్రాంగణంలో జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సిరిపురంలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌కు సీఎం చేరుకుంటారు. ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్, బయో మానిటరింగ్ హబ్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial