Raghuveera Reddy Appreciate Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అభినందించారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి రఘువరన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కార్యకర్తలను బలవంతంగా తీసుకెళ్లకుండా ఆర్భాటాల్లేకుండా సాదాసీదాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఇలాగే రాజకీయ పార్టీ నేతలు కొనసాగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా చెప్పిన విషయాన్ని చేస్తున్న పనిని అందరూ చూడవచ్చన్నారు. ప్రత్యేకంగా హంగూఆర్భాటాలతో కార్యక్రమాలు చేపట్టాల్సిన పని లేదని కామెంట్స్ చేశారు. దానిని ఆచరణలో పెట్టిన నేత చంద్రబాబు అని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.
మడకశిర నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రైతుల సమస్యలు, రోడ్లు, తాగునీరు, సాగునీరు సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు రఘువీరా. ఇలా ఇవ్వటాన్ని మడకశిరవాసిగా హర్షిస్తున్నానని అన్నారు. అయితే ముఖ్యమంత్రి చెప్పిన హామీలను ఇంప్లిమెంట్ చేసే విధంగా కూటమి ప్రభుత్వానికి భగవంతుడు శక్తిని ప్రసాదించాలన్నారు.
ఎస్సీ వర్గీకరణపై రఘువీరారెడ్డి కామెంట్స్ :
కొన్ని దశాబ్దాల కాలంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు రఘువీర్ రెడ్డి వెల్లడించారు. ధర్మాసనం పై ఉన్న ఏడుగురు జడ్జిలు ఒక మంచి తీర్పును ఇచ్చారన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం జరిగిందని ఈ ఉద్యమంలో ఎక్కువగా మందకృష్ణ మాదిగ పాత్ర ఉందని ఆయనతోపాటు ఈ ఉద్యమంలో పాల్గొన్న వారందరికి రఘువీరారెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ తీర్పుతో అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా మేలు జరుగుతుందని విశ్వసిస్తుందన్నారు.
కుల జన గణన జరగాలి :-
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కుల జన గణనను చేపట్టాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో 59 వర్గాలు ఉన్నాయని వేటిలో ఎంతమంది ఉన్నారన్నది ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. ఇప్పటివరకు ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారో తెలుసా అని అందులో ఉప కులాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే కచ్చితంగా కుల జన గణన జరగాలన్నారు.