AP minister P Narayana | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక అప్ డేట్ ఇచ్చారు. అమరావతిలో పనులు ప్రారంభానికి మరో మూడు నెలలు పడుతుందని చెప్పారు. ఏపీ రాజధాని నిర్మాణానికి గతంలో ఇచ్చిన టెండర్లను రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలుస్తామని నారాయణ చెప్పారు. శనివారం రాజధానిలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. వెంకటపాలెం, శాఖమూరులో నర్సరీలు, పార్కులను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్శన్ లక్ష్మీ పార్థసారథితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు.


మంత్రి నారాయణ శాఖమూరులోని సెంట్రల్ పార్కులో ల్యాండ్ స్కేపింగ్ యంత్రంతో స్వయంగా గడ్డి చదును చేశారు. రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం వరకూ 50 శాతం జంగిల్ క్లియరెన్స్ పూర్తయినట్లు వెల్లడించారు. అద్భుతమైన రాజధాని ఉండాలంటే రోడ్లు, భవనాలతో పాటు మంచి వాతావరణం, ప్రశాంతతకు అందించే పార్కులు ఉండాలన్నారు. అందుకే అమరావతిలో 4 పెద్ద పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, శాఖమూరులో 300 ఎకరాల్లో సెంట్రల్ పార్క్ నిర్మాణం చేస్తామన్నారు. వచ్చే 6 నెలల్లో పార్కు లు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.


అమరావతి నిర్మాణానికి రూ.60 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ సౌత్‌ కాన్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంకిపాడులో క్రెడాయ్‌ సౌత్‌ కాన్‌ ప్రారంభమైంది. ఈ ఈవెంట్ కు దేశంలోని పలు ప్రాంతాల నుంచి బిల్డర్లు హాజరై అధికారులతో సమీక్షించారు. బిల్డర్లకు అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ తీసుకువస్తామని మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.60వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ మూడు నెలల తరువాత రాజధాని పనులు ప్రారంభించి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామ్నారు. ప్రపంచంలో ఉత్తమ నగరంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిలుస్తుందని మంత్రి నారాయణ అన్నారు. అన్ని సాఫ్ట్‌వేర్‌లను అనుసంధిస్తామన్నారు. సింగిల్ విండో అనుమతుల ద్వారా పనులు వేగవంతం అవుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో  అన్ని ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం తమ లక్ష్యమన్నారు.


Also Read: Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - స్వామి వారి కానుకలు వేలం ఎప్పుడో తెలుసా?