విధానాలు మార్పు చేయొద్దని కోర్టులు చెబితే ఎన్నికలు ఎందుకు అని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీలో ప్రశ్నించారు. కోర్టులు ఒక్క సారి పాలసీ చెప్తే కార్యనిర్వాహక శాఖ నిర్వహించేస్తుందనిని వ్యాఖ్యానించారు. పీవీ నరసింహరావు అప్పట్లో సరళీకృత విధానం తీసుకోకుంటే దేశం ఎప్పుడో మునిగిపోయి ఉండేదని ..పాలసీ తీసుకునే నిర్ణయం ప్రభుత్వాలకు ఉందని ధర్మాన వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరిగింది. చర్చను ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. గతంలో ఆయనే అసెంబ్లీలో చర్చించాలని సీఎంకు లేఖ రాశారు.
కోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది : ధర్మాన
హైకోర్టు తీర్పుపై తీవ్రంగా ఆలోచించానని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఇది సున్నితమైందని కాబట్టి చాలా మందితో మాట్లాడనన్నారు. రాజ్యాంగ బద్ధమైన హక్కులను, బాధ్యతలను కట్టిడి చేసే పరిస్థితి వస్తుందని ఎక్కువ మంది చెప్పారని ధర్మాన తెలిపారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పు ప్రకారం తీర్పుపై అసెంబ్లీలో చర్చించవచ్చని .. అందుకే చర్చించాలని సీఎం జగన్‌కు లేఖ రాశానన్నారు.
న్యాయవ్యవస్థ అతీతులం కాదనే భావన విడనాడాలని సుప్రీంకోర్టు చెప్పింది : ధర్మాన
ఒక వ్యవస్థను ఇంకో వ్యవస్థ పలచన చేస్తుంటే ఇది పరువు తీసుకోవడమే కాకుండా తగని పని అని ఆయన చెప్పారు. అధికారం ప్రజల చేతిలో ఉండాలనే స్వాతంత్ర్య యోధులు కోరుకున్నారు. స్వాతంత్య్రం రాకముందే తీర్మానాలు చేశారన్నారు. రాజ్యాంగం లక్ష్యం ప్రజలు. మిగతా సంస్థలు, వ్యవస్థలు ఎన్ని ఉన్నా అంతిమ నిర్ణేతలు ప్రజలేనన్నారు. శాసన వ్యవస్థే నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటుందన్నారు. అందుకే వ్యవస్థలపై స్పష్టత ఉండాలన్నారు. వారి అధికారాలు, బాధ్యతలపై క్లారిటీ లేనప్పుడు ఫలితాలు రావు. ప్రజలకు సంబంధించిన, పాలనకు సంబంధించిన విషయాలపై కూడా క్లారిటీ ఉండాలి. ఎవరి పరిధి ఏంటి, ఎవరి విధులేంటి అనేది లేకుండా ఉంటే ఎప్పటికైనా లక్ష్యాలు చేరుకోలేం. . సుప్రీంకోర్టు 1988లో న్యాయవ్యవస్థ లేదా న్యాయమూర్తులు పబ్లిక్ విమర్శని స్వీకరించాలని చెప్పింది. న్యాయవ్యవస్థ తీర్పును సమీక్షించే అధికారం ప్రజలకే ఉందన్నారు. న్యాయమూర్తులు స్వీయనియంత్రణ పాటించాలని 2007లో చెప్పింది సుప్రీంకోర్టు. మిగతా రెండు విషయాలు పని చేయకపోతే ప్రజలు చూసుకుంటారని సుప్రీం కోర్టు చెప్పింది. మూడు విభాగాలు సంయమనం పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొంది. పరిధిలు దాటొద్దనికూడా సూచించింది. అతీతులం అనే భావన విడనాడాలని సుప్రీం కోర్టు సూచించింది. ఆ రెండు విభాగాలతో సమానం అనే భావం వాటి విధులను గౌరవిస్తూ స్వీయనియంత్రణ పాటిస్తే సమస్య రాదని చెప్పింది. న్యాయవ్యవస్థలో కత్తీ ఉండదు, పర్స్ ఉండదని... అయినా కొందరు వ్యక్తులు అవి ఉన్నాయనే అభిప్రాయంతో ఉన్నట్టు సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని ధర్మాన ప్రసంగించారు.
శాసనాలు చేసే అధికారం న్యాయవ్యవస్థకు లేదు : ధర్మాన
శాసనాలు చేసే అధికారం అసెంబ్లీ, పార్లమెంట్‌కు తప్ప వేరే వాళ్లకు లేదు. రాజ్యాంగ వ్యతిరేకమైనప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవచ్చు. దీన్ని పాటించాలి. కోర్టులు ప్రభుత్వాన్ని నడపలేవు అని చాలా జడ్జిమెంట్స్‌లో చెప్పారు.ఇది రాజధానికి సంబంధించిన అంశం కాదు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరిస్తే ఎలా అనేది నా డౌట్. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సభను అడ్డుకుంటుందా.. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడే ఈ లేఖ రాయాల్సి వచ్చింది. ప్రభుత్వం మారితే విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని చెప్తే ఎలా. ప్రజలు తీర్పు ఇచ్చి పంపించారు అంటే అప్పటి ప్రభుత్వం చేస్తున్న విధానాలు నచ్చలేదనే అర్థం కదా. కొత్త విధానాలు చేయండనే కదా అర్థం. ఆ అధికారమే మీకు లేదంటే ఏం చేయాలని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.