AP Assembly Updates: నేడు ఏపీ శాసనసభలో గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యుల తీరుతో మండలి ఛైర్మన్ 8 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు రామ్మోహన్‌రావు, రాజనర్సింహులు, రామారావు, కేఈ ప్రభాకర్ , అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, రవీంద్రనాధ్‌రెడ్డి, బచ్చుల అర్జునుడును ఛైర్మన్ సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని ఛైర్మన్ అంతకుముందు చాలాసార్లు హెచ్చరించానా వినకపోవడంతో సస్పెండ్ చేశారు.
టీడీపీ సభ్యులు మండలిలో నేడు (మార్చి 24) విజిల్స్ వేస్తూ, చిడతలు వాయిస్తూ ఆందోళన చేశారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. నాటుసారా మరణాలపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్సీలు ఏపీ శాసన మండలిలో డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. అదే చివరకు వారి సస్పెన్షన్‌కు దారి తీసింది. సభకు ముందు నారా లోకేశ్ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నాటు సారా మృతుల పాపం సీఎం జగన్ రెడ్డిదే అని ప్లకార్డులు ప్రదర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు. సభలోకి వచ్చిన అనంతరం నిరసనలో భాగంగా చిడతలు వాయిస్తూ, విజిల్స్ వేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
అడ్డుకున్న మార్షల్స్
టీడీపీ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయగానే ఆ పార్టీ సభ్యుడు దీపక్ రెడ్డి పోడియం వైపు వెళ్లడానికి యత్నించారు. దీంతో దీపక్ రెడ్డిని మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెండ్ చేస్తే ఈ దౌర్జన్యం ఏంటని చైర్మన్ మోషెన్ రాజు టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు.
కన్నబాబు ఆగ్రహం
శాసన మండలిలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు ఈ స్థాయిలో దిగజారిపోతారని అస్సలు ఊహించలేదని అన్నారు. టీడీపీ సభ్యులు బిచ్చగాళ్లలా వ్యవహరిస్తున్నారని.. పెద్దల సభలో చిల్లరగా గలభా చేస్తున్నారని అన్నారు. శాసన మండలి ఛైర్మన్ పట్ల లోకేష్ అమర్యాదగా ప్రవర్తించారని విమర్శించారు. చంద్రబాబు బయటి నుంచి సభను కంట్రోల్ చేయాలని చూస్తున్నారని అన్నారు. మద్యం విషయంలో టీడీపీ చెబుతున్న బ్రాండ్‌లన్నీ సీ బ్రాండ్‌లే అని.. సహజ మరణాలను టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి కన్నబాబు మాట్లాడారు.
శాసన మండలిలో టీడీపీ సభ్యులు చిడతలు వాయించి, విజిల్స్ వేయడంపై సభ చైర్మన్ మోషెన్ రాజు మాట్లాడుతూ... సభలో ఇలాంటివి చేయడం మంచిది కాదని.. సభకు చిడతలు, విజిల్స్ ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. సభలో చిడతలు వాయించడం ఏంటని.. సభా గౌరవాన్ని కాపాడే బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. విజిల్స్ వేయడం మంచి పద్ధతి కాదని.. వెల్‌లోకి వచ్చి మాట్లాడే హక్కు లేదని తెలిపారు. ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని హితవు పలికారు.