అమ్మఒడి లబ్ధిదారులకు రోజుకో షాక్ ఇస్తోంది ప్రభుత్వం. అసలు ఈ విద్యాసంవత్సరం అమ్మఒడి చెల్లించకుండానే మరిన్ని ఆంక్షలు పెడుతోంది. విద్యుత్ వినియోగం, అటెండెన్స్, జిల్లా పేర్లు ఇలా ప్రతి అంశం జాగ్రత్తగా పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక చేయబోతున్నట్టు వెల్లడించింది. 


ఇప్పటికి సీరియస్‌గా తీసుకోని విద్యార్థుల హాజరను ఇకపై సీరియస్‌గా తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశించింది.  నవంబర్‌ 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు కచ్చితంగా 75 శాతం ఉండాలని స్పష్టం చేసింది. లేకుంటే అలాంటి వారికి అమ్మఒడి ప్రయోజనం ఉండబోదట. 


విద్యుత్త వాడకంపై కూడా అమ్మఒడి లబ్ధిదారులకు సరికొత్త స్లాబ్ తీసుకొచ్చింది. విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటిన ఫ్యామిలీకి అమ్మఒడి పథకం ప్రయోజనం ఉండదు. 
అమ్మఒడి పథకం లబ్ధిదారుల ఎంపికలో మరికొన్ని  నిబంధనలు కూడా చేర్చింది పాఠశాల విద్యాశాఖ. బియ్యం కార్డు కొత్తది ఉండాలని తేల్చి చెప్పింది. 


ఆధార్‌ కార్డులో కూడా అడ్రెస్‌ కొత్తదై ఉండాలి. విభజించిన జిల్లాల్లో ఎక్కడ ఉంటే అదే జిల్లా పేరు ఆధార్‌ కార్డులో ఉండాలి. అలా మార్చుకొని ఆధార్‌ కార్డు అప్‌డేట్ చేయించాలి. 


బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్‌ లింక్‌ అయి ఉండాలి. లేకుంటే వెంటనే చేయించుకోవాలని సూచించింది విద్యాశాఖ. బ్యాంకు ఖాతా లైవ్‌లో ఉందోలేదో చెక్‌ చేసుకున్న తర్వాత ఆ నెంబర్‌ను అమ్మ ఒడి పథకానికి ఇవ్వాలి.