Guntur Crime News : పల్నాడు జిల్లా సత్తెనపల్లి పార్క్ ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో యువకుడు ప్రియురాలి గొంతు కోసి హత్యాయత్నం చేశాడు. యువతితో తులసీరామ్ అనే యువకుడు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. యువతిపై అనుమానంతో గురువారం కత్తితో దాడి చేశాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


అసలేం జరిగిందంటే?


సీఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం దాచేపల్లికి చెందిన షేక్‌ ఫాతిమా భర్తతో విడిపోయి గత 6 నెలలుగా సత్తెనపల్లిలోని పాత బస్టాండు ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. గత కొంత కాలంగా మాచర్లకు చెందిన తులసీరామ్‌తో ఆమె సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా తాలూకా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు పార్టీ కార్యాలయానికి వస్తుండగా రోడ్డుపై రక్తపు మడుగులో పడిఉన్న ఫాతిమాను గుర్తించారు. తక్షణమే స్పందించిన జనసేన నాయకులు ఆమెను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఫాతిమాను సత్తెనపల్లి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తులసీరామ్ ఫాతిమా గొంతును తులసీరామ్‌ కోశాడా లేకా వారిద్దరి మధ్య గొడవలతో ఆత్మహత్యాయత్నం చేసిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సీఐ శోభన్ బాబు తెలిపారు. బాధితురాలు మాట్లాడలేని స్థితిలో ఉండడంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. తులసీరామ్‌ పరారీలో ఉన్నట్లు సీఐ శోభన్ బాబు వెల్లడించారు. 


గతేడాది బీటెక్ యువతి దారుణ హత్య 


గతేడాది ఆగస్టులో గుంటూరు పట్టణంలో బీటెక్ యువతిపై కత్తితో దాడి చేశాడో ప్రేమ్మోన్మాది. పట్టపగలు అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద బీటెక్ విద్యార్థిని రమ్యపై యువకుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. కాకాని రోడ్డులోని పరామయకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. సెయింట్ మేరీస్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నల్లపు రమ్యను ప్రేమ పేరుతో యువకుడు వేధించాడు. యువతితో ఈ విషయంలో వాగ్వాదానికి దిగి కత్తితో దాడి చేశాడు. ఒక్కసారిగా దాడికి ప్రయత్నించగా రమ్య తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. యువకుడు రమ్యను చేయి పట్టుకుని పొట్టలో రెండు కత్తిపోట్లు పొడిచాడు. దీంతో యువతి రోడ్డుపై రక్తపు మడుగులో పడిపోయింది. ఇదంతా ఎదురుగా హోటల్ వద్ద టీ తాగుతున్న వారు, వారికి దగ్గరలో ఆటో దిగిన వారు చూస్తూనే ఉన్నారే కానీ స్పందించాలేదు. కత్తిపోట్లకు గురై రోడ్డుపై పడిపోయిన రమ్యపై మీద పడి కత్తితో పదేపదే దాడిచేస్తున్నా ఎవరూ దగ్గరకు వచ్చే సాహసం చేయలేదు. సీసీ కెమెరాలో ఈ ఘటన రికార్డైంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీంతో పోలీసులు స్పందించి గంటల వ్యవధిలో నిందితుడిని పట్టుకున్నారు. తీవ్రగాయాలతో యువతి చికిత్స పొందుతూ మరణించింది.