AP CM Chandra Babu Naidu will attend World Economic Forum in Davos: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మినిస్టర్ లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ దావోస్‌లో పర్యటించనున్నారు. జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం 2025లో పాల్గోనున్నారు. వీళ్ల ముగ్గురితోపాటు అధికారుల బృందం కూడా టూర్‌లో ఉంటుంది. ఈ పర్యటనకు సంబంధించిన అనుమతులకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. 


ఆంధ్రప్రదేశ్‌ సీఎం, మంత్రుల బృందంతోపాటు పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు కూడా దావోస్‌ వెళ్లనున్నారు. పెట్టుబడులు ఆకర్షణే ధ్యేయంగా చేపట్టే ఈ పర్యటనలో పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా నివేదికలు, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లు సిద్ధం చేస్తున్నారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చేందుకు ఉన్న వనరులు, ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీలను వివరించనున్నారు. ‘షేపింగ్ ది ఇంటెలిజెంట్ ఏజ్’ అనే థీమ్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టూర్‌కు వెళ్తోంది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌కు ఓ ప్రత్యేకంగా స్టాల్‌ను కేంద్రం రిజర్వ్ చేసింది.


ఏటా జనవరి 20 నుంచి జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు ఈసారి ఏడుగురు కేంద్ర మంత్రులు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు కేంద్ర ప్రభుత్వం తరఫున రామ్మోహన్ నాయుడు, అశ్విని వైష్ణవ, సీఆర్ పాటిల్‌, చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరి పాల్గొంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు ఆయా రాష్ట్రాల మంత్రులు, అధికారుల బృందం పాల్గోనుంది. 


ఈ సదస్సుకు 50 దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, యూఎన్‌వో, ఐఎంఎఫ్‌, వరల్డ్ బ్యాంక్‌, ఇంటర్‌పోల్‌, నాటో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, డబ్ల్యూటీవో టీమ్స్‌ పాల్గొనబోతున్నాయి. వీల్లే కాకుండా వివిధ కార్పొరేట్ సంస్థల సీఈవోలు, యజమానులు, రిలయన్స్, టాటా సన్స్, అదానీ గ్రూప్, బిర్లా, భారతీ, మహీంద్రా, గోద్రేజ్, జిందాల్, బజాజ్, వేదంతా గ్రూపు సంస్థల టీమ్స్‌ పాల్గొంటాయి. 


సదస్సులో చర్చించే అంశాలు:-
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం, 
గ్లోబల్ వార్మింగ్ సవాళ్లు, 
అధిక రుణ భారం
ఇంటర్ కనెక్టెడ్ టెక్నాలజీస్‌తో ఉత్పాదకత పెంపుపై చర్చిస్తారు. 


1994 నుంచి హాజరవుతున్న చంద్రబాబు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పడు, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న 2014-19 మధ్య కూడా చంద్రబాబు ఈ వరల్డ్‌ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సులో పాల్గొన్నారు. గత ఐదేళ్ల జగన్ హయాంలో ఒకసారి మాత్రమే వెళ్లారు. 2015 జనవరిలో భవిష్యత్ నగరీకరణపై చంద్రబాబు మాట్లాడారు. 2016లో మాస్టరింగ్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అన్న అంశంపై చంద్రబాబు చర్చించారు. 2017, 2018లో కూడా సదస్సుకు హాజరయ్యారు. 2019లో దావోస్ టూర్‌కు లోకేష్‌ లీడ్ చేశారు. 


2014 -15లో రూ. 8,326 కోట్లకు ఒప్పందాలు జరిగాయి
2015-16 లో రూ. 10,315 కోట్లకు ఒప్పందాలు జరిగాయి
2016-17 లో రూ. 14,767 కోట్లకు ఒప్పందాలు జరిగాయి
2017-18 లో రూ. 8,037 కోట్లకు ఒప్పందాలు జరిగాయి
2018-19 లో రూ. 23,882 కోట్లకు ఒప్పందాలు జరిగాయి
2022లో జగన్ రెడ్డి దావోస్ సదస్సులో పాల్గొన్నారు.  చరిత్రలో మలువు, ప్రభుత్వ విధానాలు, వ్యాపార వ్యూహాలు అనే అంశంపై మాట్లాడారు.