AP Cabinet Meeting : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 19న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మంత్రులుగా పలువురు బాధ్యతలు స్వీకరించారు. వీరికి శుక్రవారం శాఖలను కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు అప్పజెప్తారని చెబుతున్నారు. అలాగే నారా లోకేష్ కు గతంలో మాదిరిగానే ఐటీతోపాటు అర్బన్ మంత్రిత్వ శాఖను కట్టబెట్టే అవకాశం ఉంది. మిగిలిన మంత్రులకు వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలను చంద్రబాబు నాయుడు అప్పగిస్తారని చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం నాటికి శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. 


పలు పథకాల పేర్లు మార్పు 


తెలుగుదేశం నేతృత్వంలోని కోటను రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొన్ని కీలక మార్పులు దశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాల పేర్లను మాచనన్నట్లు తెలుస్తోంది. పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్పు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ అయ్యాయి. వీటితోపాటు మిగిలిన పథకాలకు పేర్లు మార్చే అవకాశం ఉంది.


గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు నాటి సీఎం జగన్, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేర్లు ఎక్కువగా ఉన్నాయి. వీటి పేర్లను మార్చి ఎన్టీఆర్ తోపాటు ఇతర ముఖ్యమైన నాయకుల పేర్లు పెట్టే అవకాశం ఉంది. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటికే పెన్షన్ పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు సంతకాన్ని కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.


ప్రస్తుతం రూ.3 వేలు ఉన్న పెన్షన్ రూ.4 వేలకు పెంచుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు  ఇప్పటివరకు 3000 పెన్షన్ ఇస్తుండగా ఇకపై నాలుగు వేలు చెల్లించనున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం మూడు వేలు ఇస్తుండగా, ఇకపై ఆరు వేలు ఇవ్వనున్నారు. కుష్టు వ్యాధితో వైకల్యం సంభవించినవారికి ఆరువేలు చెల్లించనున్నారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పదివేలు చెల్లించనున్నారు. మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు వచ్చే నెల నుంచి అందించనున్నారు.