Chandrababu Letter To CS : మాండూస్ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని లేఖలో కోరారు.  తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. తుపాను ప్రభావంతో అనంతపురం, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరి, అరటి, బొప్పాయి, అపరాలు, పొగాకు, శనగ, మిరప, ప్రత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. వర్షాలతో కోతకు వచ్చిన వరి పంట నీటమునిందన్నారు. కోతలు కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయిందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు వేల కోట్ల నష్టం జరిగిందని, అయినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని ఆరోపించారు.  


వరి రైతులకు గోనె సంచుల కొరత 


"ధాన్యం సేకరణలో ప్రభుత్వం భారీగా కోత విధించింది. ప్రభుత్వ ఆంక్షలు, కొత్త నిబంధనలతో పంటను సరైన ధరకు అమ్ముకునే పరిస్థితి లేకపోయింది. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ధాన్యంలో తేమ 17 శాతం కన్నా అధికంగా ఉంటే మద్దతు ధరలో కోత విధిస్తున్నారు. తేమ శాతం తగ్గించుకునేందుకు 20 రోజులుపైగా ధాన్యాన్ని రోడ్లపై, కళ్లాల్లో ఉంచాల్సి వస్తుంది. ధాన్యం ఆరబెట్టడానకి బరకాలు, టార్పాలిన్లు, కూలీల ఖర్చు రైతుకు అదనపు భారంగా మారింది. ధాన్యం కొనుగోలుపై పరిమితులు విధించి, దళారులకు అమ్ముకోవాలని ప్రభుత్వమే సూచించడం సరైన పద్ధతి కాదు. వరి రైతులకు గోనె సంచుల కొరత కూడా వేధిస్తుంది. రాయితీపై రైతులకు అందించే టార్పాలిన్‌ల పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది." - చంద్రబాబు 






తేమతో సంబంధంలేకుండా ధాన్యం కొనుగోలు 


ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 1.25 లక్షల ఎకరాల్లో పొగాకు రైతులు నష్టపోయారని చంద్రబాబు అన్నారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని సూచించారు. తుపానుతో నష్టపోయిన వరి, అపరాలకు ఎకరానికి రూ.20 వేలు, వాణిజ్య, ఉద్యానవన పంటలకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం చెల్లించాలని చంద్రబాబు లేఖలో కోరారు. ఈ-క్రాప్‌ నిబంధలు, ఆంక్షలు లేకుండా ఇన్యూరెన్స్‌ అందించాలన్నారు. కౌలు రైతులకు నేరుగా పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పంట నూర్చిన వెంటనే అక్కడే కొనుగోలు చేసే విధానం అమలుచేయాలన్నారు. ధాన్యంలో తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.