KVP Ramachandra Rao : దివంగత నేత వైఎస్ఆర్ ఆత్మగా పిలిచే కేవీపీ రామచంద్రరావు... జగన్ మోహన్ రెడ్డికి మాత్రం ముందు నుంచి దూరంగానే ఉన్నారు. అలా ఎందుకు ఉన్నారో త్వరలో ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని కాంగ్రెస్ నేత కేవీపీ స్పష్టం చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి ఎంతో ఆప్తుడినైన తాను జగన్‌కు ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పనన్నారు. ఈ విషయంపై ఎంతో కాలం దూరంగా ఉండలేమన్నారు. ఏదో ఒకరోజు సమాధానం చెప్పాల్సివస్తుందన్నారు. త్వరలో ప్రెస్‌మీట్‌ పెట్టి అన్నీ విషయాలు చెబుతానన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా తప్పుబట్టారని, ఏపీ నేతలు మాత్రం స్పందించడంలేదన్నారు.


అదానీ అవినీతిని ప్రశ్నిస్తే దేశద్రోహమా?


వేల కోట్లు మోసం చేసిన అదానీని ప్రశ్నిస్తుంటే అదేదో దేశద్రోహం కింద  రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు చేస్తుందని కేవీపీ రామచంద్రరావు అన్నారు. రాహుల్ గాంధీ ప్రశ్నించడం మొదలుపెట్టడంతోనే మోదీ ప్రభుత్వం తల్లక్రిందులైందన్నారు. ఒక అవినీతి పరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నించారు. మూడు తరాల పాటు  దేశానికి సేవచేసిన కుటుంబం గాంధీ కుటుంబమని కేవీపీ గుర్తుచేశారు. పార్లమెంట్ లో ఓ సభ్యుడి ప్రసంగాన్ని తొలగించడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు  చూడలేదన్నారు. ప్రతిపక్షాల గొంతునొక్కేలా... పార్లమెంట్ లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలన్నారు. బీసీలను రాహుల్ గాంధీ అవమానించారని అంటున్న జేపీ నడ్డా తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యుడి అనర్హతపై రాష్ట్రపతి సంతకం చేయాలని, రాహుల్ గాంధీ అనర్హత పత్రంపై రాష్ట్రపతి సంతకం చేశారా? అని కేవీపీ ప్రశ్నించారు. కోర్టు బెయిల్ ఇచ్చినా... రాహుల్ గాంధీని తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలనడం దుర్మార్గమని మండిపడ్డారు.  


ఏపీలో తప్ప అన్ని రాష్ట్రాల్లో స్పందన 


ఒక్క ఏపీలో తప్ప అన్ని రాష్ట్రాల్లో  రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయంపై నిరసనలు తెలిపారని కేవీపీ రామచంద్రరావు అన్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెబుతున్న పవన్ కల్యాణ్... రాహుల్ గాంధీ అనర్హత వేటుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇవాళ ప్రశ్నించలేకపోతే ఇంకెప్పుడు ప్రశ్నిస్తారని పవన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  చంద్రబాబు ఒక సీనియర్ నాయకుడైతే రాహుల్ గాంధీ అనర్హతపై స్పందించేవారని మండిపడ్డారు. చంద్రబాబు తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారన్నారు.  2016లో రాహుల్ గాంధీ ఫ్లెక్సీలను చించేసి, ఆంధ్ర ద్రోహులని కాంగ్రెస్ నేతలపై దాడులు చేయించి, తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు.   ఏపీలో 25 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులున్నారని, ఏ ఒక్క ఎంపీ అయినా రాహుల్ గాంధీ అనర్హత వేటుపై ప్రశ్నించారా? అని కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నేతలను మనం ఎన్నుకున్నందుకు సిగ్గుపడాలన్నారు. తమ స్వార్ధప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర పద్ధతులను పాటిస్తోందన్నారు. దేశానికి అప్పులు పెరిగితే అదానీకి మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయని విమర్శించారు. అదానీ నుంచి మోదీకి వాటా వెళ్తుందని ఆరోపించారు.