Digital Water Meters: అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీల్లో తప్పనిసరిగా వాటర్ మీటర్లు అమర్చుకోవాలని తాజాగా కేంద్ర సర్కారు పేర్కొంది. తాగునీటి, గృహ అవసరాల కోసం రోజూ 20 క్యూబిక్ మీటర్లకు మించి భూగర్భజలాలు వాడే భవన సముదాయాలు అన్నింటికీ ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని తెలిపింది. ఒకవేళ్ అపార్ట్‌మెంట్లలో స్విమ్మింగ్ పూల్ ఉంటే అవి భూగర్భజలాలపై ఆధారపడితే తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు తీసుకోవాలని స్పష్టం చేసింది. భూగర్భ జలాల వినియోగ నియంత్రణకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ 2020 సెప్టెంబర్ 24వ తేదీన కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవరించి తాజాగా కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన మోడల్ బిల్డింగ్ బైలాస్ మేర రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లాన్ ను సమర్పించాలని పేర్కొంది. పరిశ్రమలన్నీ వచ్చే మూడేళ్లలో భూగర్భజలాల వినియోగాన్ని కనీసం 20 శాతం మేర తగ్గించుకోవాలని ఆదేశించింది. అందుకు తగ్గట్టు కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొంది. ట్యాంకర్ల ద్వారా భూగర్భజలాలను సరఫరా చేసే వారు తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు తీసుకోవాలని తెలిపింది.
బోర్ల నుండి ఉప్పు నీరు వాడుకునే వారు ఆ నీటి నాణ్యతను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ లేబొరేటరీస్ ద్వారా లేదంటే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రయోగశాలలో పరీక్ష చేయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వాణిజ్య సంస్థలు భూగర్భజలాలను వాడుకుంటుంటే వాటర్ ఆడిట్ ను ఆన్ లైన్ లో సమర్పించాలని తెలిపింది. ఆ నీటిని ఏయే అవసరాలకు ఉపయోగించుకుంటున్నదీ చెప్పాలని ఆదేశించింది. ఆ రిపోర్టులను సెంట్రల్, స్టేట్ గ్రౌండ్ వాటర్ అథారిటీస్ పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని పేర్కొంది.
రోజుకు వంద క్యూబిక్ మీటర్లకు మించి భూగర్భజలాలను ఉపయోగించే అన్ని పరిశ్రమలూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర భూగర్భజల అథారిటీ-సీజీడబ్ల్యూఏ ధ్రువీకరించిన సంస్థల ద్వారా వాటర్ ఆడిట్ చేయించాలని కొత్త నోటిఫికేషన్ లో కేంద్ర సర్కారు పేర్కొంది. మూడు నెలల్లోపు ఆ రిపోర్టులను సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీకి సమర్పించాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పారిశ్రామిక ప్రాంతాల్లో భూగర్భజలాల స్థితిగతులను కనిపెట్టి ఉంచడానికి కేంద్ర భూగర్భజలాల మండలి ఆ ప్రాంతాల్లో ఫీజోమీటర్లు నెలకొల్పుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మిగతా పారిశ్రామిక ప్రాంతాల్లో భూగర్భజలాల పర్యవేక్షణ కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కఠిన శిలల నుండి భూగర్భజలాలను ఉపయోగించే పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణానికి 15 మీటర్ల లోపు ఫీజో మీటర్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.
తాగునీటి, గృహ అవసరాల కోసం రోజుకు గరిష్ఠంగా 25 క్యూబిక్ మీటర్ల వరకు భూగర్భజలాలను ఉపయోగిస్తుంటే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. 25 నుండి 200 క్యూబిక్ మీటర్ల వరకు నీటిని వాడుకుంటే ఒక్కో క్యూబిక్ మీటరుకు రూపాయి చొప్పున వసూలు చేస్తారు. 200 క్యూబిక్ మీటర్లకు పైగా నీటిని వాడుతుంటే ఒక్కో క్యూబిక్ మీటర్ కు రూ.2 చొప్పుల వసూలు చేస్తారు. ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు నీటి వాడక పరిమాణంతో సంబంధం లేకుండా క్యూబిక్ రూ.0.50 చెల్లించాలి.